సలవులొచ్చినా, తీరిక దొరికినా సినిమా ఒక్కటే వినోదం కాదు. కుదిరితే నాలుగు మాటలు. కుప్ప పోసుకోవాలనుకుంటే బోలెడన్ని అనుభూతులు. కాసింత విజ్ఞానం. కావాల్సినంత సంతోషం. క్షణం తీరిక దొరకని ఆధునిక జీవితాలకు ఇవే ముఖ్యం అనుకున్న ప్రియాంక... 'ఈవెనింగ్‌అవర్ డాట్‌కామ్' లైబ్రరీ... మినీ థియేటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇది పదిమందికీ ఆనందం పంచే వేదిక. ఆమెకు ఉపాధి మార్గం.
ఎం.ఎస్. చదివి
ప్రియాంకకు అసలు ఈ ఆలోచన అనుకోకుండా వచ్చింది. ఎం.ఎస్. చదివిన ఆమె అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసింది. వివాహరీత్యా హైదరాబాద్‌కి వచ్చేసిన ఆమె ఇక్కడే స్థిరపడాలనుకుంది. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ఆదాయం సంపాదించాలనుకుంది. అప్పుడు కలిగిన ఆలోచనే ఈవెనింగ్ అవర్. అది ప్రియాంకకు బాగా నచ్చింది. కానీ ఇంట్లో వారు వద్దన్నారు. 'అంత చదువుకున్నావు... ఏదయినా వ్యాపారం చేయొచ్చుగా' అని సూచించారు. ప్రియాంక వారిని ఒప్పించింది. దీనివల్ల పదిమందికి విజ్ఞానం, వినోదం. ఇంటిపట్టున ఉన్నా నాకు ఆదాయ మార్గం అంటూ వివరించింది. పుస్తకాల సేకరణ, ఆన్‌లైన్‌లో వాటిని ఎంచుకునే ఏర్పాటు, ధరల నిర్ణయం వంటి వాటికి ఆర్నెల్ల సమయం పట్టింది. ఇంట్లో మినీ థియేటర్ ఏర్పాటుకైతే బాగా కష్టపడాల్సి వచ్చింది. ఖర్చూ భారమైంది. ఎలాగైతేనేం, నాలుగు నెలల క్రితం లైబ్రరీ... థియేటర్... రెండూ అందుబాటులోకి వచ్చాయి.
ఆరువేల పుస్తకాలు...
పుస్తక ప్రియులు ఈవెనింగ్ అవర్ డాట్‌కామ్‌లోకి ప్రవేశిస్తే అందుబాటులోని పుస్తకాల జాబితా ఎదురొస్తుంది. నెలకి వంద రూపాయల రుసుముతో ఎవరైనా వారానికి రెండు పుస్తకాలు తీసుకోవచ్చు. తెలుగు, ఆంగ్లంలోని పేరెన్నికగన్న పుస్తకాలను హాయిగా చదువుకోవచ్చు. 'కొందరికి పుస్తకాలంటే ప్రాణం. మరికొందరికి అప్పుడప్పుడూ చదివే అలవాటు. అందుకే బేసిక్, స్టార్టర్, ఎవిడ్ రీడర్ అంటూ మూడు ప్యాకేజీల్లో పుస్తకాలిచ్చే ఏర్పాటు చేశా. పాఠకులు కోరుకుంటే ఇంటివద్ద పుస్తకాలందించే సదుపాయమూ ఉంది' అని తెలిపారు ప్రియాంక.
థియేటర్ అంతా కుటుంబమే..
గ్రంథాలయం ఏర్పాటులో ప్రియాంక వ్యక్తిగత ఆనందమూ ఇమిడి ఉంది. పుస్తక పఠనంపై అమితాసక్తి కలిగిన ఆమె పుస్తకాలను చదివి, వాటి మీద సమీక్షలను సైట్‌లో ఉంచుతారు. అవి పుస్తకాల ఎంపికలో పాఠకులకు దిక్సూచిలా ఉపయోగపడతాయి. ప్రస్తుతం నవలలు, కథలు, జీవిత చరిత్రలు, సైన్స్ ఫిక్షన్... అన్నీ కలిపి నాలుగు వేల పైచిలుకు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పాఠకులు కోరితే మరో రెండు వేల పుస్తకాలు తెప్పించే ఏర్పాట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి తెప్పించుకోవడమే కాదు. హాయిగా గ్రంథాలయంలో కూర్చుని కమ్మని కాఫీ తాగుతూ... స్నాక్స్ తీసుకుంటూ చదువుకొనే వీలు కూడా ఉంది. ఇదంతా ఒకెత్తు కాగా... ఏడెనిమిది మంది కుటుంబ సభ్యులు ఇంటి వాతావరణంలో... నవ్వుతూ తుళ్లుతూ... మినీ థియేటర్‌లో సినిమా చూసే వీలు కల్పించడం మరో ప్రత్యేకత. ఒక కుటుంబం, కోరుకున్న సినిమా చూసేందుకు వెచ్చించాల్సిన మొత్తం కేవలం మూడొందలు. అయితే ఈ మొత్తం చెల్లించి కొత్త సినిమాలు చూడాలని ఆశపడితే కుదరదు. మార్కెట్లోకి వచ్చేసిన డీవీడీలకే పరిమితం.
సభ్యులు మూడొందలు...
ఆలోచన వినూత్నంగా ఉంటే ఆదరణ సులువే. ప్రియాంక విషయంలో అదే నిజమైంది. లైబ్రరీ, థియేటర్ ఆరంభించిన నాలుగు నెలలకే మూడొందల మంది వినియోగదారులు సభ్యులయ్యారు. ఆనోటా ఈనోటా ఈ వినూత్న ఉపాధికి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఎంతో తపనపడి ఆరంభించిన ఆమె నేడు ఆదాయం పొందుతున్నారు. ఆనందంగా ఉన్నారు.
courtesy - eenadu
No comments:
Post a Comment