ఛాతీనొప్పి, కడుపునొప్పి వంటివి వచ్చినపుడు మనం వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగెడుతుంటాం. కానీ బరువు తగ్గటం, కొద్దిగా తినగానే కడుపు నిండటం, హఠాత్తుగా తలనొప్పి రావటం వంటి వాటిని అంతగా పట్టించుకోం. అయితే అలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని, అందుకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ కారణమయ్యే అవకాశమూ ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం.
1. బరువు తగ్గటం: ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా బరువు తగ్గుతుంటే ఏదో ఒక సమస్యకు సూచన కావొచ్చని అనుమానించాలి. ఆర్నెళ్లలో 10% బరువు తగ్గితే (ఉదా: 60 కిలోలు ఉన్నవారు 6 కిలోలు) వెంటనే డాక్టర్ని సంప్రదించటం మేలు. దీనికి థైరాయిడ్, కుంగుబాటు, కాలేయవ్యాధి, క్యాన్సర్, పోషకాలను గ్రహించటంలో శరీరంలో ఇబ్బందులు ఏర్పడటం వంటివి కారణం కావొచ్చు.
2. విడవకుండా జర్వం: మన శరీరం వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్నప్పుడు సాధారణంగా జ్వరం వస్తుంటుంది. అయితే మూడు రోజులపాటు గానీ అంతకన్నా ఎక్కువరోజులు గానీ తక్కువ స్థాయిలో (102 డిగ్రీల ఫారన్హీట్ కన్నా ఎక్కువ) విడవకుండా జ్వరం ఉంటున్నా.. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం (104 డిగ్రీల ఫారన్హీట్ కన్నా ఎక్కువ) వస్తున్నా జాగ్రత్త పడాలి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటివి కూడా విడవకుండా జ్వరం రావటానికి కారణం కావొచ్చు. క్యాన్సర్ల వంటి జబ్బులూ ఇందుకు దోహదం చేస్తాయి.
3. శ్వాసలో ఇబ్బంది: జలుబు చేసినప్పుడో, వ్యాయామం చేస్తున్నప్పుడో శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటం సహజమే. కానీ మామూలు సమయాల్లో శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటే మాత్రం అనుమానించాల్సిందే. ముఖ్యంగా పడుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటే నిర్లక్ష్యం చేయరాదు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఏర్పడటానికి దీర్ఘకాలంగా శ్వాసకోశవ్యాధులు, బ్రాంకైటిస్, ఉబ్బసం, న్యుమోనియా, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టటం, గుండె జబ్బుల వంటివి కారణం కావొచ్చు.
4. మలవిసర్జనలో మార్పులు: రోజుకి మూడుసార్ల నుంచి వారానికి మూడుసార్లు మల విసర్జన జరుగుతుంటే సాధారణ స్థితిగానే పరిగణించొచ్చు. అందుకు విరుద్ధంగా ఏవైనా లక్షణాలు కనిపిస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మలంలో రక్తం పడటం, వారానికి పైగా అతిసారం, మూడు వారాల పాటు మలబద్ధకం, నల్లగా గానీ రంగుతో కూడిన మలం, హఠాత్తుగా మల విసర్జన అవుతుండటం వంటివి గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇలాంటి లక్షణాలకు బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు.. పేగుల్లో పూత, పెద్దపేగు క్యాన్సర్ వంటివి దోహదం చేస్తుండొచ్చు.
5. ప్రేలాపన (డెలీరియమ్): ఉన్నట్టుండి ఏదేదో మాట్లాడటం, అయోమయానికి గురికావటం వంటివి గమనిస్తే తేలికగా తీసుకోరాదు. సమయం, స్థలాలను గుర్తించటంలో తికమకపడటం, అకారణం కోపం, ఏకాగ్రత కోల్పోవటం, జ్ఞాపకశక్తి నశించటం, ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే అలక్ష్యం కూడదు. ఇన్ఫెక్షన్లు, రక్తహీనత, రక్తంలో చక్కెర తగ్గటం, మానసిక సమస్యల వంటివి వీటికి దోహదం చేస్తుండొచ్చు.
6. తీవ్రమైన తలనొప్పి: తలనొప్పి సాధారణంగా వచ్చేదే అయినా హఠాత్తుగా తీవ్రంగా వస్తే మాత్రం ఇతరత్రా సమస్యలకు సూచిక కావొచ్చు. తలనొప్పితో పాటు జ్వరం, మెడ బిగుసుకుపోవటం, దద్దు, అయోమయం, మూర్ఛ వస్తుంటే వెంటనే చికిత్స ప్రారంభించాలి. 55 ఏళ్లు దాటిన తర్వాత కొందరికి కణతల్లో ధమనివాపు వల్ల కూడా కొత్తరకం తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. మెదడులో ట్యూమర్ ఏర్పడినా తలనొప్పి రావొచ్చు.
7. హఠాత్తుగా చూపు, మాట కోల్పోవటం: ఇలాంటి లక్షణాలు పక్షవాతానికి హెచ్చరిక కావొచ్చు. శరీరంలో ఒకవైపు హఠాత్తుగా బలహీన పడటం, మొద్దుబారటం.. చూపు మసక బారటం, పూర్తిగా కోల్పోవటం.. మాట పోవటం, ఇతరుల మాటలను అర్థం చేసుకోలేకపోవటం.. మగతగా అనిపించటం, తూలి పడటం వంటివి గుర్తించినపుడు ఏమాత్రం ఆలస్యం చేయరాదు.
8. కళ్లముందు మెరుపు: హఠాత్తుగా కంటి ముందు మెరుపులాంటి కాంతి కనిపిస్తే తీవ్రమైన సమస్యకు గుర్తు కావొచ్చు. కంటి వెనక పొర నుంచి రెటీనా విడిపోయినప్పుడు ఇలా కనిపిస్తుంది. తక్షణం చికిత్స చేస్తే శాశ్వతంగా చూపు పోయే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.
9. కొద్దిగా తిన్నా కడుపు నిండటం: ఇలాంటి లక్షణం వారం పాటు కనిపిస్తే వెంటనే డాక్టర్కి చూపించుకోవాలి. దీనికి వికారం, వాంతి, త్రేన్పులు, జ్వరం, బరువు తగ్గటం/పెరగటం వంటివీ తోడైతే ఇబ్బంది ముదిరినట్టే. అన్నవాహిక క్యాన్సర్, జీర్ణాశయ సమస్యలు ఈ లక్షణాలకు కారణం అవుతుండొచ్చు.
10. కీళ్ల వాపు, నొప్పి: కీళ్లల్లో ఇన్ఫెక్షన్ వల్ల ఇలాంటివి కనిపించొచ్చు. దీనికి గౌట్ వ్యాధి, కొన్ని రకాల కీళ్లవాపులు కూడా దోహదం చేస్తాయి.
-courtesy: eenadu sukibhava