Pages

Thursday, February 4, 2010

ఒక వ్యక్తి శక్తిగా ఎదగగలడు!!

మహానది ఒక బిందువుగానే ప్రారంభమవుతుంది. ఒక బిందువే సమస్త విశ్వంగా విస్తరిస్తుంది. తల్లి కడుపులో బిడ్డ ఒక బిందువుగానే ఉత్పన్నమవుతుంది. మొదట వేసిన ఒక్క అడుగే వేలాది అడుగులుగా మారి గమ్యాన్ని చేరుస్తుంది. మర్రి బీజం ఆవగింజంతైనా ఉండదు. అదే మర్రి వృక్షరాజంగా విరాజిల్లుతుంది. అలాగే ఒక వ్యక్తి శక్తిగా ఎదగగలడు. మహాశక్తిగా మారగలడు. అది వెలికితీసిన దివ్యత్వమే.

ఎప్పుడూ మన కోసమైన దాన్ని మనమే భద్రపరచాలి. మనమే శుభ్రపరచాలి. దాని ఉన్నతికోసం, ఉజ్జ్వలత కోసం, ఉద్దేశ సాఫల్యతకోసం మనమే కృషిచేయాలి. ఈ ఇల్లు మనది. ఈ కుటుంబం మనది. ఈ ఊరు, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచం, విశ్వం... అన్నీ మనవే. మనిషి కుదించుకుని ఉన్నప్పుడే, కుంచించుకుని ఉన్నప్పుడే 'నేను' అనే అతి చిన్న పరిధిలో ఉంటాడు. తనను తాను, తన బుద్ధిని, హృదయాన్ని విస్తరించుకుంటూ పోయే కొలదీ ఆ పరిధి చిన్నచిన్నగా, పెద్దగా, మరింత పెద్దగా, అనంతంగా విస్తరించుకుంటూ పోయి ఏకాత్మ భావనలో లయమైపోతుంది. విలీనమైపోతుంది. ముందు నేను, నాదిలోంచి విస్తరిస్తూ మనం, మనదిగా విస్తృతమై మనంలోంచి 'మనం' అనే అనేకాన్ని జయించి- నేను నా అనే సువిశాల నిజ అనంతంలోకి, ఏకత్వంలోకి లయం చేస్తూ ఆత్మభావంలో స్థిరపడిపోవాలి.

మనం మన గదిలో ఉన్నప్పుడు మన కుటుంబీకులతో 'నా గది' అంటాం. పక్కింటివాళ్లతో ఇంటిని 'మా ఇల్లు' అంటాం. వీధులకు సంబంధించి 'మా వీధి' అంటాం. అలాగే వూరు, దేశం, ప్రపంచం. సంకుచితత్వాన్ని వదలిపెడితే సర్వం 'నేనే' అనే భావనలో లీనమైపోతాం. ఈ భావం ఆత్మకే కాదు. ఆధ్యాత్మికతకే కాదు. సామాజిక జీవితానికీ వర్తిస్తుంది. ఈ ప్రపంచంలో జన్మ తీసుకున్న మనం ఈ ప్రపంచానికి, ఈ సమాజానికే చెందినవారం. ఈ ప్రపంచం కోసమే మనం జీవించాలి. దానికోసమే మరణించాలి.

మన శరీరానికి జబ్బు చేస్తే మనమే చికిత్స చేసుకుంటాం. ఎవరో చేయాలనో, చేయించాలనో సాధారణంగా ఆశించం. సమాజానికీ అంతే. అది మనది. ఏం చేసినా మనమే చేయాలి. ఈ సువిశాల విశ్వం, ఈ ప్రపంచం... ఇందులో నేనెంత! ఒక చిన్న వూరు. ఆ వూళ్లో చిన్న ఇల్లు. చిన్న కుటుంబం. అందులో నేనొకణ్ని. ఒకానొక అర్భకుణ్ని. సముద్రంలో ఒక నీటిబిందువును. భూమండలంలో ఒక మట్టి రేణువును. అణువును. కానీ, తెలుసా? ఒక అణువే ఆటంబాంబు అవుతుంది. ఒక బిందువే సింధువుగా మారుతుంది. ఒక చిన్న చిట్టెలుక... కొండను తవ్వగలదు. కాళ్లూ చేతులూ లేని చిరు చేప... సముద్రాన్ని ఈదగలదు. ఒక చిన్నారి పక్షి... ఆకాశాన్నే ఏలగలదు. మనిషి... ఆ పరాత్పరుణ్నే ఒక ఆచమనంతో ఔపోసన పట్టగలడు. ఇది ఆశ్చర్యమే. అద్భుతమే. కానీ వాస్తవం.

ఏ వ్యక్తీ 'నేనొక్కణ్ని. అర్భకుణ్ని. నేనేం 'చేయగలను?' అని భీతి చెందకూడదు. మనం శరీరానికి అర్భకులం కావచ్చు. ధనానికో, వయసుకో అర్భకులం కావచ్చు. కానీ ఆత్మవిశ్వాసానికి అర్భకులం కాదు. ఆత్మ స్త్థెర్యానికి అర్భకులం కాదు. మనిషి ఏ స్థితిలో ఉన్నా ధృతి, ధీశక్తి పోగొట్టుకొనే అవకాశం ఉంది. ఇంకా ప్రోది చేసుకునే అవకాశం ఉంది.

మనిషెప్పుడూ ఒక్కడు కాదు. ఒంటరి కాదు. ఆత్మ తోడుగా ఉంది. అనంతశక్తి తోడుగా ఉంది. ప్రాపంచికమైన తోడును పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదంటారు రామకృష్ణులు. నీకు ఎవరు; ఎందరు తోడున్నా ఎవరూ లేరనే అభిప్రాయంతోనే ఒంటరిగా నీ పనిలో నిమగ్నుడవు కమ్మంటారు. జగజ్జనని మాత్రమే తోడుగా ముందుకు సాగమంటారు. ఎంత గొప్పగా ఉంది! నిజమే. ఎవరైనా ఎందరైనా మనకు తోడుగా ఉండనీ. మంచిదే. కానీ ఎవరి సహకారమైనా మనం ఎందుకు ఆశించాలి? వాళ్ల వెన్నుదన్నుకోసం బెరుగ్గా ఎందుకు వెనక్కు వెనక్కు చూడాలి? మన శక్తిమీద, మనోస్త్థెర్యం మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగటం ప్రారంభిస్తే, మనం నడిచే దారి మంచిదైతే, గమ్యం సరియైునదైతే- మన వెనక అడుగుల చప్పుడు మనకు వినబడుతుంది. మన గుండె చప్పుడులో కలిసిపోతుంది. మహాత్మాగాంధీ, మండేలా, మదర్‌ థెరెసా... ఒక్కరా ఇద్దరా! ప్రపంచాన్నే తమ వెంట నడిపించిన ఒంటరి పధికులు. ఆసేతు హిమాచలం ఎన్నోసార్లు పాదచారియైు పర్యటించి అంతరించిపోతున్న ఆధ్యాత్మికతను పునరుద్ధరించి, అనేక శక్తిపీఠాలను స్థాపించి, అద్వైతాన్ని మకుటాయమానంగా నిలిపిన శంకరాచార్యులు నూనూగు మీసాలైనా రాని బాల సన్యాసి. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి పెట్టిన గాంధీజీ అర్భక అర్ధనగ్న చక్రవర్తి. డెబ్భైఏళ్లు దాటాకే ప్రభుపాద స్వామి, ఒంటరిగా కట్టుబట్టలతో అమెరికాలాంటి భౌతికవాద దేశంలో కాలుమోపి 'హరేరామ హరేకృష్ణ' ఉద్యమాన్ని వారి సొంతమే అని వారు భావించేంతలా ఉద్ధృతంచేసి, వందలాది 'ఇస్కాన్‌టెంపుల్స్‌' నిర్మించి, పిట్స్‌బర్గ్‌ దగ్గరలో వారి ఇష్టంతో వారే తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి గోల్డెన్‌ పాలెస్‌ నిర్మింపజేసుకున్న అనితర సాధ్యుడు. ఎందరు... ఎందరు ఎందరో మహానుభావులు. ప్రయత్నమే వారి విజయ ప్రకటన. వారి సంకల్పమే వారికి తోడు. లోక కల్యాణమే వారికి సిరి, వూపిరి.

నేడు లోకంలో ఎంతో స్వార్థం, దౌష్ట్యం, అవినీతి, కష్టాలు, కన్నీళ్లు... దీన్నిలాగే వదిలేద్దామా? మనదైన ఈ లోకాన్ని ఈ సమాజాన్ని, కనీసం ఈ దేశాన్ని, కనీసం ఈ రాష్ట్రాన్ని, కనీసం... చుట్టూ ఉన్న మన పొరుగువారినైనా క్షేమంగా, సౌకర్యవంతంగా ఉండేలా మనమెందుకు ప్రయత్నించకూడదు? అందుకు ఏదో, ఏమిటో, ఎంతో అవసరం లేదు. అందుకు కావలసింది బిగించిన ఒక ఉక్కు పిడికిలి. దానికి ఆ శక్తినిచ్చే వజ్రసదృశ సంకల్పం. మనం ఒంటరివాళ్ళం కూడా కాదు. తెలీని కొత్తదారీ కాదు. మనముందు ముళ్లూ, పల్లేళ్లూ తొక్కుతూ ఎందరో ధీమంతులూ, త్యాగధనులూ నడిచి, విడిచి, వెళ్లిన అడుగు జాడలున్నాయి. వారి విజయాల జ్యోతులు మన దారి వెలుతురుకై వెలుగుతున్నాయి.
- - చక్కిలం విజయలక్ష్మి
- - courtesy : eenadu

No comments:

Post a Comment