Pages

Monday, December 21, 2009

'జీవితాన్ని, కెరీర్‌ని, పనిని సీరియస్‌గా తీసుకో'

హలో నేనే అనీషా. నేనిలా కార్లను తళతళలాడించే రంగంలోకి వస్తానని అనుకోలేదెప్పుడూ. అయితే ఒకటి, ఉద్యోగం చేయడం కన్నా ఏదయినా సృజనాత్మక వ్యాపారంలో అడుగుపెట్టాలని మొదటి నుంచి ఆలోచించేదాన్ని. మాది మార్వాడీ కుటుంబ నేపథ్యం.

నేను పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే. నాన్న వ్యాపారవేత్త. అమ్మ గృహిణి. నన్ను, అన్న రాఘవ్‌ని మొదట్నుంచి చదువుకొమ్మని ప్రోత్సహించారు. ముంబయి యూనివర్సిటీ నుంచి నేను ఎంబీఏ, అన్న బీఎంఎస్‌ పూర్తి చేశాం.

చదువయ్యాక ఉద్యోగంలో చేరా. మా అమ్మాయి ఫలానా సంస్థలో పని చేస్తోంది అని మా అమ్మ గొప్పగా చెప్పుకొనే స్థాయిదే అది. అనువైన వేళలు. అలసట లేని జీవితం. అయినా నాకందులో ఆనందం కలగలేదు. అదే విషయం అన్నతో అన్నా. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తన పరిస్థితీ అంతే. ఇద్దరం కలిసి మెదడుకు పని పెట్టాం.

చెబితే నమ్మరు కానీ మొదట పళ్లరసాల స్టాల్‌, బోర్డ్‌ గేమ్‌ రూపకల్పనవంటి వాటి గురించే ఆలోచించాం. మాకే నచ్చలేదు. ఎన్నో చర్చల తరవాత కారు క్లీనింగ్‌ ఆలోచన తట్టింది. ఇల్లు తరవాత చాలామంది అవసరంగా కొనుక్కునే వస్తువు కారు. మోజుపడి, ఖరీదుపెట్టి, మంచి బ్రాండ్‌నే ఎంచుకుంటారు. కానీ నిర్వహణ విషయానికొచ్చేసరికి... చాలామంది వాచ్‌మెన్‌, డ్రైవర్‌, ఇంట్లో పని మనిషికే పరిమితం అవుతారు.లేదంటే తెలిసిన చోట శుభ్రం చేయిస్తారు. వీటికి బదులుగా... పైపై మెరుగులకే పరిమితం కాకుండా... విడి భాగాల మన్నిక, శుభ్రతకూ ప్రాధాన్యమిస్తూ ప్రొఫెషనల్‌ సంస్థనొకదాన్ని ఆరంభించాలని అనుకున్నాం. అదే మిస్టర్‌ కార్‌బాత్‌. ఐదులక్షల పెట్టుబడితో మొదలైంది.అన్న, నేను వ్యాపార భాగస్వాములం.

ఉద్యోగానికి రాజీనామా చేశా. అన్నతో కలిసి కార్‌ క్లీనింగ్‌ సర్వీసులో చేరిపోయాను. ఎంతో తెలివైన వాడనుకొన్న కొడుకు, తరవాత కూతురు ఇలా కార్లు కడిగే పనిలోకి రావడం మా అమ్మానాన్నలకి రుచించలేదు. మా ప్రణాళికలు వివరించి ఒప్పించాం. కానీ నలుగుర్లోకి వెళ్లినప్పుడు ఏం చెప్పాలో తెలిసేది కాదు. మనదేశంలో ఇదొక వ్యవస్థీకృత రంగం కాదు. కనీసం అందరూ మెచ్చుకునే ఉద్యోగం కాదు. అందుకే ఉద్యోగాలూ చేస్తూనే, కార్‌ క్లీనింగ్‌ సేవలందిస్తున్నా అనిఅబద్ధం చెప్పేదాన్ని. లేదంటే 'జీవితాన్ని, కెరీర్‌ని, పనిని సీరియస్‌గా తీసుకో' అంటూ లెక్చరిస్తారని భయం.

ఎవరో ఏదో అంటారని కాదు, అడుగుపెట్టిన రంగంలో విజయం సాధించాలని నాకూ ఉంటుందిగా! స్థానికంగా ఉండే చిన్న క్లీనింగ్‌ సెంటర్లకి వెళ్లా. త్రీఎం వంటి సంస్థల్ని సందర్శించా. విడిభాగాల శుభ్రతకు ఏ పద్ధతుల్ని అనుసరిస్తున్నారు, ఏయే తరహా పనిముట్లు వాడుతున్నారు, ఏయే రసాయనాలు వినియోగిస్తున్నారన్న అధ్యయనం కోసం విదేశాలకు వెళ్లా. ఈ తపన సత్ఫలితాలనిచ్చింది. ఆరంభించిన తొలినాళ్లలోనే వినియోగదారులు మమ్మల్ని ఆదరించారు. నోటిమాటగా ముంబయి అంతా పాకింది. దేశవ్యాప్తంగా పలు ప్రసార మాధ్యమాలు నన్ను, అన్నయ్యను ఇంటర్వ్యూ చేశాయి.

గ్యారేజీలు, సర్వీసు స్టేషన్లలోని సాధారణ పనితీరుకి ఎంతో భిన్నమైన, ఎన్నోరెట్లు మెరుగైన సేవలను మేం అందిస్తాం. అధ్యయనం, పరిశోధనల్లో నిగ్గుతేలిన పద్ధతుల్ని ఆచరిస్తాం. కారు బయటి, లోపలి భాగాలను శుభ్రపరిచేందుకు మేం పాతిక పద్ధతుల్ని అనుసరిస్తాం. రకరకాల బ్రష్‌లు, రసాయనాలు, ఉపకరణాలు, యంత్రాలు వాడతాం. ఒకరకంగా చెప్పాలంటే, కొత్తకారు రూపాన్ని తీసుకొచ్చి అప్పగిస్తాం.

ఈ రంగంలో మహిళలు అరుదు. బహుశా లేరనే చెప్పాలి. కానీ సహనం, సమయపాలన, శ్రద్ధ, చొరవ ఉన్న వారికి ఈ రంగంలో చక్కటి అవకాశాలున్నాయి. కానీ ఇది కూర్చుని చేసే పని కాదు. ఫలానా సమయం అని లేకుండా పరుగులు తీసి సేవలందించాలి. సేవల తీరు, విడిభాగాల నాణ్యత గురించి వివరించే పరిజ్ఞానం సంపాదించాలి. అయితే ఇదొక గుర్తింపు ఉన్న ఉద్యోగం కాదు కాబట్టి చదువుకున్న వారు రారు. వచ్చినా ఎక్కువ జీతాలు ఇవ్వాలి. ఆ సమస్యలన్నిటినీ అధిగమిస్తే ఆదాయం, ఆనందం.

courtesy: eenadu

Saturday, December 12, 2009

మొక్కలలోని సహజ రసాయనాలతో పురుగుమందులు !!

రసాయనిక మందుల వాడకంతో వాతావరణంలో పెను మార్పులు. పంట నష్టాలు.. క్యాన్సర్‌ మరణాలు. ఈ దుష్పరిణామాలను గమనించిన ఓ మహిళ... నిర్విరామ పరిశోధనతో వాటికి ప్రత్యామ్నాయాలను కనుగొంది. సహజసిద్ధమైన మందులను తయారుచేసింది. ఈ మధ్యనే జాతీయ పర్యావరణ అవార్డు... ప్రతిష్ఠాత్మక నాబ్స్‌ ఫెలోషిప్‌ను సాధించిన ఆ శాస్త్రవేత్తే... హైదరాబాద్‌కి చెందిన ఉషారాణి.

పంటలను కాపాడుకోవాలి, అధిక దిగుబడులు సాధించాలి... అనేదే రైతన్నల తపన. ఆ ప్రయత్నంలో, తెలిసి కొందరు, తెలియక ఎందరో రసాయనిక పురుగుమందులను వాడుతుంటారు. అలా మితిమీరే వాడకంతో పర్యావరణానికి, పంటలకు, మానవులకు ఎదురయ్యే ప్రమాదం గురించి ఉషారాణి కలవరపడ్డారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తగా సహజ పురుగు మందుల తయారీకి నడుంకట్టారు. మొక్కల్లోని సహజ రసాయనాలతో ఏ మాత్రం ప్రమాదం లేని ఆరు రకాల పురుగుమందుల్ని కనిపెట్టారు.
మూడు దశాబ్దాలుగా పరిశోధనల్లో నిమగ్నమైన ఉషారాణిపై తండ్రి ప్రభావం అధికం. 'మా నాన్న స్వాతంత్య్ర సమరయోధుడు. చిన్నప్పట్నుంచి సరైన మార్గనిర్దేశం అందించారు. ఏ పని చేసినా సమాజానికి ఉపయోగపడేది చెయ్యాలి నువ్వు అంటూ పదేపదే చెప్పేవారు.ఆ ప్రభావంతోనే పరిశోధన రంగంలో అడుగుపెట్టాను' అని వివరించారామె. పీజీ పూర్తయ్యాక ఉద్యోగం చేసే పలు అవకాశాలు ఎదురొచ్చాయి. కానీ కాసుల కన్నా కలకాలం నిలిచిపోయే పరిశోధనలే ప్రాణం అనుకున్నారు. పెళ్లయ్యాక భర్త సహకారంతో కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. 'పరిశోధనల నిమిత్తం జపాన్‌ వెళ్లడం కీలక మలుపు. అక్కడ నలభై దేశాల వారితో పరిచయాలు మానసికంగా ఎంతో ధైర్యాన్నిచ్చాయి. వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెరిగింది' అన్నారు ఉషారాణి.

విదేశాల్లో సముపార్జించిన విజ్ఞానం స్వదేశానికి తిరిగొచ్చాక ఉపయోగపడ్డాయి. ఐఐసీటీ శాస్త్రవేత్తగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడు రైతుల కష్టాలను కళ్లారా చూసింది. 'ఓసారి పంటలపై పురుగు మందుల్ని స్ప్రే చేస్తున్న రైతు నేను చూస్తుండగానే సొమ్మసిల్లి పడిపోయాడు. ఏం జరిగిందోనని కంగారుపడ్డ నేను అతడి కుటుంబీకుల మాటలు విని మరింత ఆందోళన చెందాను. అలా పడిపోవడం సాధారణమే, కాసేపయ్యాక కోలుకుంటారని చెప్పారు. విపరీతంగా రసాయనాల్ని వాడటం వల్లే ఆ ప్రమాదాలని అర్థం చేసుకున్నా' అంటూ ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. సమస్య పరిష్కారానికికార్యాచరణను వేగిరం చేశారు. రసాయనాల ప్రభావంతో క్యాన్సర్‌ బారిన పడిన రైతులను చూసి వారి కష్టాలు తీర్చే పరిశోధనలు చేయాలని తపనపడింది.

పెరట్లో పెంచుకునే కూరగాయల మొక్కలపై ఉషారాణి సుదీర్ఘకాలంపరిశోధనలు చేశారు. వాటిల్లోని రసాయనాల నుంచి సహజ పురుగు మందుల తయారీకి శ్రీకారం చుట్టింది. అలా ఆరు రకాల మందులు రూపొందాయి. 'వాటి వాడకంతో పంటల దిగుబడి బావుంటుంది. పర్యావరణానికి ఏ హాని జరగదు. రైతుల ఆరోగ్యం, ఆనందం సాధ్యపడతాయి' అన్నారామె. మూడు దశాబ్దాల నిర్విరామ కృషితో ముందుకు సాగుతున్న ఆమెకు ఇటీవలే జపాన్‌ కాన్సులేట్‌ హియోషీ పర్యావరణ జాతీయ అవార్డునిచ్చి సత్కరించింది. నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ బయలాజికల్‌ సైన్స్‌ (నాబ్స్‌) ఫెలోషిప్‌ ప్రకటించి సత్కరించింది. మన రాష్ట్రం నుంచి ఈ పురస్కారం అందుకున్న మహిళా శాస్త్రవేత్త ఉషారాణి ఒక్కరే!

ఉషారాణి కేవలం పరిశోధనలకే పరిమితం కాలేదు. గ్రామాల్లో పర్యటిస్తూమహిళల్ని, రైతుల్ని చైతన్యపరుస్తూ రసాయనిక పురుగుమందుల వాడకంతోకలిగే దుష్పరిణామాల్ని వివరిస్తున్నారు. ఖాళీ అయిన పురుగు మందుల డబ్బాల్ని ఇళ్లలో వాడితే అనారోగ్యాల బారిన పడతారని హెచ్చరిస్తోంది. విదేశాల్లో నిషేధించిన మందుల్ని మనదేశంలో ఇప్పటికీ వాడటంపై సదస్సుల్లో ప్రస్తావిస్తోంది.

సహకారం : ప్రసాద్‌. cortesy: eenadu

Sunday, December 6, 2009

ముందు తరాలకు డబ్బు ఒక్కటే ఇస్తే చాలా?

నా బాధల్లా ఒక్కటే. ఈ కాలంలో ఎవరికీ నిజంగా వాళ్లకేం కావాలో తెలియదు. జీవిత పరమార్థం ఏమిటో అసలే ఆలోచించడం లేదు. ముందుతరాల కోసం డబ్బు కూడపెట్టడంలో బిజీగా ఉంటున్నారు. ముందు తరాలకు డబ్బు ఒక్కటే ఇస్తే చాలా? డబ్బుకు మించిన సంపద లేదా? నేను సంతోషంగా ఉంటూ ముందు తరాలను సంతోషంగా ఉంచే మార్గం ఏమిటనే జిజ్ఞాస ఎవ రిలోనూ లేదు. చివరకు కోళ్లు, పశువులు కూడా వాటి పిల్లలను ఒక దశ వరకే పెంచుతాయి. ఆ తరువాత వాటిని స్వతంత్రంగా వదిలేస్తాయి. మనం మాత్రం పిల్లల్ని అంటిపెట్టుకొని, వాళ్లను గొప్పగా పెంచుతున్నాం, చదివిస్తున్నాం, వాళ్లను బాగుచే శాం అన్న అనుభూతిలో పరవశించి పోతాం. చివరకు మనం ఎటుపోతున్నామో తెలుసుకొనే లోగా పుణ్యకాలం పూర్తయిపోతుంది. బతుకు బండి లాగేందుకు మనకున్న సమయంలో 25 శాతం కేటాయిస్తే చాలు.

మిగిలిన 75 శాతం సమయాన్ని ఆత్మాన్వేషణకు, పరహితానికి ఉపయోగిస్తే మనం, మనతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడంతా నిజమైన జీవితలక్ష్యానికి దూరంగా ప్రయాణిస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మికం అనేవి ఈ కాలంలో మనసు లోపలి నుంచి పుట్టడం లేదు. అసలు మనసు లోపలి పొరల్ని తాకే ఏ విషయం కూడా రుచించని కాలం ఇది. ఈ తరుణంలో ఆత్మశోధన కోసం ఓ చోట కూర్చొని ఆన్వేషించే ఓపిక ఎవరికి ఉంటుంది? ఓ నలుగురు మంచి సాధకుల్ని భావితరాలకు అందిస్తే ఈ యోగాలయం స్థాపన సార్థకం ఆవుతుందని నాలుగు గదులు కూడా కట్టించాను. బహుశా ఈ కాలంలో అది సాధ్యం కాకపోవచ్చునేమో! ఆ పరమాత్మ నాకు ఇంతవరకే అవకాశం ఇచ్చాడనుకుంటాను. ఒక్కటి మాత్రం నిజం.. నిజమైన ఆధ్యాత్మిక భావాలు రగలనిదే ఏ జీవితంలో కూడా నిజమైన ఆనందం నిండదు. ఏ ఒక్కరి బతుకూ పండదు. అలాంటి ఆధ్యాత్మిక చేతనను రగిలించే వారు.. దాన్ని అందుకొనే వారు మెరుగైన సమాజానికి చాలా అవసరం.

-swaami dheerananda

Saturday, December 5, 2009

మహిళా సంపాదకులు

ఎడతెగని జాతుల సమరం. భీకరమైన గెరిల్లా పోరు నియంతృత్వపు పదఘట్టనలు. అరాచక శక్తుల అత్యాచారాలు బాంబుల మోతలు... రక్తపుటేరులు. వీటన్నిటి శోధనకు ఆడా, మగా అన్న తేడా లేదు. సాహసం ముఖ్యం. ప్రజాహితం ప్రధానం 'ఆ తెగువ... ఆ నేర్పు మాకున్నాయి... అందుకే కలం పట్టాం... అక్షర యాగం చేస్తున్నాం'అంటున్నారు మహిళా విలేకరులు, సంపాదకులు.

హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన మహిళా సంపాదకులు అభివృద్ది వార్తల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రసారమాధ్యమాల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని.. వారి రాక సామాజిక మార్పునకి దోహదం చేసేదిగా ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రజావసరాలకే ప్రాధాన్యం...
పత్రికలు రాజకీయ వార్తలకు పరిమితం అవుతుంటాయని ఓ వాదన ఉంది. కానీ అటువంటి పరిస్థితి మా దేశంలో లేదన్నారు బల్గేరియాలో టెలిగ్రాఫ్‌ పత్రికకు డిప్యూటీ ఎడిటర్‌గా ఉన్న మాయా మాల్డినోవా. 'మా దేశంలోని ముఖ్యమైన పది పత్రికల్లో ఐదింటికి ప్రధాన సంపాదకులు మహిళలే. రిపోర్టింగ్‌లోనూ అమ్మాయిలదే పైచేయి. చర్చలతో కాలయాపనకంటే వేగానికే విలువిస్తాం. మానవీయ వార్తలకే పెద్ద పీట. బహుశా మీడియాలో మహిళల ప్రవేశం పెరిగాక చోటుచేసుకున్న పెద్ద మార్పు ఇదేననుకుంటా. అలాగే రాజకీయ వార్తల కంటే ప్రజలకు ఉపయోగపడే సమాచారం అందివ్వడానికే అత్యధిక ప్రాధాన్యమిస్తాం. ఒక రైలు పది నిమిషాలు ఆలస్యంగా వస్తుందంటే.. ఆ విషయాన్ని పాఠకులకు తెలపాలని ఆరాటపడతాం' అని వివరించారు.

బ్రేకింగ్‌ న్యూస్‌లో నంబర్‌వన్‌
ముద్రణ, ఎలక్ట్రానిక్‌ రంగాలే కాదండోయ్‌... నెట్‌, మొబైల్‌ మాధ్యమాల్లోనూ మహిళలు ముందంజ వేస్తున్నారు. అందుకు జర్మనీ వంటి దేశాలు ఉదాహరణ. 'మా మీడియాలో సగం వాటా మహిళలదే. మ్యాగజైన్ల నిర్వహణయితే పూర్తిగా వారిదే. నేను బాధ్యతలు నిర్వహిస్తున్న వొడాఫోన్‌ మొబైల్‌ న్యూస్‌ విభాగంలో ఇప్పటికే 22 శాతం యువతులున్నారు. ఎలక్ట్రానిక్‌, మొబైల్‌, నెట్‌ వార్తల్లో... వేగమే ముఖ్యం. ఎంత వేగంగా స్క్రోలింగ్‌ ఇచ్చాం అన్నదే ప్రాధాన్యం. బ్రేకింగ్‌న్యూస్‌ ఒరవడిలో అమ్మాయిలే ముందున్నారని నేను గర్వంగా చెప్పగలను. మా జర్మనీలో ఆడమగా అంటూ అసమానతలు లేవు. మహిళల అభివృద్దికి ఎక్కడా బ్రేకుల్లేవు' అంటూ అభిప్రాయాలు పంచుకున్నారు వొడాఫోన్‌ మొబైల్‌ న్యూస్‌ విభాగానికి ఎడిటర్‌గా ఉన్న యూటే కొరింత్‌.

పిల్లల కోసం జాతీయ పత్రికలు
పారిస్‌ పేరు చెబితే చాలు.. ఫ్యాషన్‌ గుర్తొస్తుంది. ప్రపంచానికి సొగసు పాఠాలు నేర్పే ఆ దేశంలో పత్రికలు వినోదానికి ప్రాధాన్యం ఇస్తున్నాయని అనుకుంటున్నారా! కాదు... విజ్ఞానానికే పట్టం కడుతున్నాయి. ఆ విషయాన్నే ఇలా వివరించారు ఆరలిన్‌ మెక్‌మేన్‌. ఈమె వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూస్‌పేపర్స్‌ అండ్‌ న్యూస్‌ పబ్లిషర్ల తరఫున పనిచేస్తున్నారు. 'పిల్లలు, యువత, మహిళలకు సంబంధించిన వార్తలే మా పతాక శీర్షికలు. మీకు తెలుసా? ఏ దేశంలో లేని విధంగా పారిస్‌లో పిల్లల కోసం మూడు జాతీయ పత్రికలు నడుస్తున్నాయి. 24 శాతం వార్తలు యువతను ఉద్దేశించినవే. మేం రాజకీయ వార్తలు రాస్తాం... కానీ అవి కచ్చితంగా అభివృద్ధిని కోరేవి అయి ఉండాలి. మా దేశంలోని ఆరు ప్రధాన వార్తాపత్రికల్లో ఇద్దరు మహిళా సంపాదకులు ఉన్నారు. పారిస్‌లో మహిళా విలేకరులకు ఓ ప్రత్యేక సదుపాయం ఉంది. అత్యధికంగా రెండేళ్లపాటు ప్రసూతి సెలవు ఇస్తారు' అన్నారు.

ఈ తరం అభిరుచులకు ప్రాధాన్యం...
టీవీ, రేడియో, నెట్‌ ప్రభావం అధికమయ్యాయి. దీంతో పత్రికలు చదివే ఈనాటి అమ్మాయిల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకుండా ఏం చేస్తున్నారో వివరించారు ఉక్రెయిన్‌కి చెందిన ఓక్సానా. 'పత్రికలను చదివే అలవాటును పెంచే దిశలో యూరప్‌లో కొన్నిచోట్ల పత్రికలను ఉచితంగా పంచుతున్నారు. అలాగే వార్తల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు..' అని వివరించారు.

పాక్‌లో వేతన వ్యత్యాసం...
ప్రపంచదేశాల్లోని పరిస్థితులు ఒకరకంగా ఉంటే పాకిస్తాన్‌లో మరోరకం. ఉగ్రవాదం, నియంతృత్వం. స్వేచ్ఛకు లెక్కలేనన్ని పరిమితులు. ఈ పరిస్థితుల్లోనూ మహిళా పాత్రికేయులు మొక్కవోని దీక్షతో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ 'ది న్యూస్‌ ఆన్‌ సండే'కు చీఫ్‌ ఎడిటర్‌గా ఉన్న ఫరాజియా... న్యూస్‌లైన్‌ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా ఉన్న రెహానా హకిమ్‌... దక్షిణాసియా ఫ్రీ మీడియా అసోసియేషన్‌ ప్రిన్సిపల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా ఉన్న మెహమల్‌ సర్‌ఫ్రాజ్‌... తమ అంతరంగం ఆవిష్కరించారు.

''మా దేశంలో ఎన్నో అస్థిరతలు. గిరిజన పోరాటాలు. తీవ్రవాద శక్తులు. ఈ సమయంలో పరిశోధనాత్మక వార్తలకే మా ఓటు. మా జాతీయ, అవీ ఆంగ్ల పత్రికల్లో మహిళలు చురుగ్గా పనిచేస్తున్నారు. సంపాదకత్వం వహిస్తున్నారు. స్థానిక పత్రికల్లో మాత్రం పూర్తి నిరాశజనకమైన పరిస్థితులున్నాయి. ఎడిటింగ్‌ రంగంలో మాత్రం మహిళలదే ఆధిపత్యం. అయితే మేమూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. మొదటి పేజీలో హింసాత్మక, ఉగ్రవాదుల ఫొటోలు ఇవ్వడం తగ్గించాం. ఆరోగ్యం, చదువు, అభివృద్ధి వార్తలకు ప్రాధాన్యం పెంచాం. స్వాత్‌లోయ లాంటి తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో రిపోర్టింగ్‌, డ్రగ్‌ మాఫియాను ఎదురించి వార్తలు రాయడంలో మా మహిళా జర్నలిస్టులు ఎంతో సాహసం ప్రదర్శిస్తున్నారు. పురుషులతో పోటీపడి విధులు నిర్వహిస్తున్నా స్థానిక పత్రికల్లో తీవ్రమైన వేతన వ్యత్యాసాలు ఉన్నాయి.''

courtersy : eenadu

Wednesday, December 2, 2009

ఆనందం వర్ణనాతీతం

మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. నేను సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తాను. అతనిది వ్యాపారం. అప్పుడే పెళ్లిచేసుకోవాలని అనుకోకపోయినా.. మంచివాడు, అందగాడు.. అని అంగీకరించాను. అలా ఏడాది క్రితం పెళ్లయ్యింది. మిగతా కుటుంబసభ్యులందరూ వూళ్లో ఉండటంతో ఇద్దరం సొంత సంసారాన్ని మొదలుపెట్టాం. అక్కడినుంచే మా ఇద్దరిమధ్యా చిన్నచిన్న మనస్పర్థలు మొదలయ్యాయి. ఇంటికి అవసరమైన వస్తువుల్లో ఫలానా కంపెనీ ఫ్రిజ్‌ బాగుంటుందంటే.. లేదంటూ మరో పేరు చెప్పేవారు. వెంటనే కొనుక్కొచ్చేసేవారు. అదొక్కటే కాదు.. రంగులు, వంటింటి సామగ్రి.. చివరకు డోర్‌మ్యాట్ల ఎంపిక.. ఇలా ప్రతిదాంట్లో ఇద్దరి ఆలోచనలు వేర్వేరని క్రమంగా అర్థమయ్యింది. అభిరుచులూ అంతే. నాకేమో చిన్నచిన్న సరదాలు. వాటి గురించి ఆనందంగా వివరిస్తుంటే.. నవ్వేసి తేలిగ్గా తీసుకునేవారు. ఇలాంటివన్నీ మా ఇద్దరిమధ్యా తెలియకుండానే దూరాన్ని పెంచుతున్నాయని ఏడాది తర్వాత గ్రహించాను. ఇదే కొనసాగితే.. పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని.. స్నేహితురాలు ఓ సందర్భంలో సలహా ఇవ్వడంతో.. ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అనుకోకుండా అతనిలోనూ చిన్నచిన్న మార్పులు కనిపించడంతోపాటు.. నా ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం ఇంకా పెరిగింది. ఇంతకీ ఏం చేశామంటే..
మేం చేసిన మొదటిపని.. ఒకరి అభిరుచుల్ని ఒకరు గౌరవించడం నేర్చుకున్నాం. గతంలోలా.. ఏదైనా చెబితే నవ్వుకోవడం.. లేదా అందరిముందు ఆ విషయాన్ని ప్రస్తావన తీసుకురావడం లాంటివన్నీ పూర్తిగా తగ్గించేశాం.
తనకు తీరిక వేళల్లో పెయింటింగ్‌ వేయడం చాలా ఇష్టం. నాకు చిన్న గీత కూడా గీయడం రాదు. ఆ ఆసక్తిని గమనించిన నేను.. అప్పుడప్పుడు కాన్వాస్‌, రంగుల్ని కానుకగా ఇవ్వడం మొదలుపెట్టా. అంతేనా.. తను వేసిన పెయింటింగ్‌లను ప్రదర్శనలో ఉంచడానికి ఏర్పాటుచేశా. ఆ రోజు తన ఆనందం వర్ణనాతీతం.
ఇద్దరూ కలిసి షాపింగ్‌చేయడం నాకు చాలా ఇష్టం. అలా అడిగినప్పుడల్లా.. 'ప్లీజ్‌! నువ్వే తీసుకురా. నాకు కుదరకపోవచ్చు..' అంటూ సున్నితంగా తప్పించుకునేవారు. ఇలా కాదని చెప్పి.. చిన్నచిన్న పనులు నేనే చేసుకున్నా.. మీకు కుదిరినప్పుడే వెళ్దామంటూ చెప్పేదాన్ని. నొప్పించకుండా చెప్పడంతో.. కొన్నిరోజులకు ఆయనే.. వీలుకల్పించుకుని వచ్చేవారు. ఇప్పుడు కూరగాయల కోసమైనా సరే.. ఇద్దరం కలిసే వెళ్లడం మాకు అలవాటయ్యింది.
నాకేమో.. వివిధ ప్రాంతాల వంటలపుస్తకాలను కొనడం ఓ అలవాటు. నన్నో వింతగా చూసేవారు ఆయన. వ్యాపారంలో భాగంగా ఎక్కడికైనా వెళ్తే.. ఆ ప్రాంతపు వంటకాలున్న పుస్తకాన్ని తెచ్చివ్వమని అడిగేదాన్ని. ఒకటిరెండుసార్లు గుర్తుచేసి తెప్పించుకున్నా. క్రమంగా అడక్కుండానే తేవడం మొదలుపెట్టారు. ఇప్పుడు నా దగ్గర బోలెడు పుస్తకాలున్నాయి.
ఒక్క వారాంతంలో తప్ప.. మిగిలిన రోజుల్లో మాంసాహారం వండటం.. నాకు ఇబ్బందిగా అనిపించేది. ఉద్యోగ హడావుడే అందుక్కారణం. దాంతో బయట తినడానికి అలవాటుపడ్డారు. ఆ సమస్యను తగ్గించడానికి.. సులువుగా అయిపోయే వివిధ ప్రాంతాల వంటకాలను గుర్తించి చేయడం మొదలుపెట్టా. వెరైటీ వంటకాలు.. ఆయనచేత రెస్టరంట్లకు వెళ్లే అలవాటును దాదాపు తగ్గించాను.
- సంధ్య