Pages

Wednesday, March 31, 2010

షాకింగ్ ప్రశ్నలు - బ్రేకింగ్ జవాబులు ! (విటుడు - వేశ్య)

వేశ్యా వృత్తి దురాచారాన్ని ఖండిస్తూ ప్రముఖ కవి కాళ్ళకూరి నారాయణరావు వందేళ్ల క్రితమే సందించిన బ్రహ్మాస్త్రం చింతామణి నాటకం. ఆ పుస్తకంలోని ఒక అద్బుతమైన పార్టే ఈ పోస్టు

బిల్వ అనే విజ్ఞానవంతుడైన విటుడి ప్రశ్నలకు చింతామణి ఇచ్చిన సమాధానాలు చదవండి

* అత్యంత సుందరమైనది ఏది?
@ ప్రకృతి
* అత్యంత భయంకరమైనది ఏది?
@ సంసారము
* మనల్ని ఎపుడూ విడువనిది?
@ ఆశ
* దేనిచేతను చావనిది ?
@ అహంకారము
* ఎంత దారిద్ర్యం లో ఉన్నా సుఖపెట్టగలిగేది ?
@ తృప్తి
* అన్నింటి కంటే బలమైనది?
@ అవసరం
* అన్నింటికంటే సుఖమైనది ఏది?
@ ఇతరులకు సలహా చెప్పుట
* అన్నింటి కంటే కష్ట సాధ్యమైనది ?
@ తన తప్పు తాను తెలుసుకొనుట
* పాపములన్నిటిని హరించేది ?
@ పచ్చాతాపం

Sunday, March 28, 2010

చిన్నమార్పు... భారీ పొదుపు ! మీ ఇంటి కోసం !!

ఒక యూనిట్‌ కరెంటు పొదుపు రెండు యూనిట్ల కరెంటు ఉత్పత్తితో సమానం. కరెంటు పొదుపునకు అనేక మార్గాలున్నా పాటించడానికి మనసు రావడం లేదు. చిన్న చిన్న మార్పులతో ఎంత కరెంటు ఆదా చేయోచ్చో చూడండి

* తాతల కాలం నాటినుంచీ వాడుతున్న బల్బులకు 60 వాట్‌లు, ట్యూబ్‌లైట్లకు 36 వాట్‌ల కరెంటు అవసరం అవుతుంది. అదే కాంపాక్టు ఫ్లోరోసెంట్‌ ల్యాంపుల(సీఎఫ్‌ఎల్‌)కు 11-15 వాట్‌లు అయితే సరిపోతుంది. రాష్ట్రంలో రెండు కోట్ల పాతకాలం బల్బులను తీసేసి సీఎఫ్‌ఎల్‌ లాంటి దీపాలు పెడితే ఏటా వెయ్యి మెగావాట్లు కరెంటు ఆదా చేసినట్లే.

* చౌక్‌ ఉన్న ట్యూబ్‌లైట్‌ల(55 వాట్‌) స్థానంలో చౌక్‌ లేకుండా పనిచేసే కోటిన్నర సన్నటి ట్యూబ్‌లైట్లు బిగిస్తే ఏటా 500 మెగావాట్లు దుబారాను నివారించవచ్చు.

* కొత్తగా ఎల్‌ఈడీ దీపాలు వచ్చాయి. వీటికి ఒక వాట్‌ కరెంటు సరిపోతుంది. వీటిని బెడ్‌ ల్యాంప్‌లుగా 50 లక్షల పడక గదుల్లో వాడితే ఏటా 30 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగాన్ని తగ్గించవచ్చు.

* సాధారణ జెట్‌ పంపులు వాడితే రోజుకి 2.25 యూనిట్లు ఖర్చవుతుంది. అదే సబ్‌ మెర్సిబుల్‌ పంపుసెట్లకు 1.25 యూనిట్లు సరిపోతుంది. 20 లక్షల పంపుసెట్లు మార్చినా ఏడాదికి 70 కోట్ల యూనిట్లు కరెంటు మిగిలినట్లే.

* చాలా ఇళ్లలో ఫ్యాన్లకు సాధారణ రెగ్యులేటర్‌లు ఉన్నాయి. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్‌ రెగ్యులేటర్లు బిగిస్తే 15 శాతం కరెంటు పొదుపు చేయొచ్చు.

Friday, March 26, 2010

భక్తుడి ప్రశ్న - దేవుడి లాజిక్ !

ఒక భక్తుడు భగవంతుణ్ని ప్రశ్నించాడట- 'స్వామీ! మా మిత్రుడికి అపారమైన ఐశ్వర్యాన్నిస్తున్నావు. విలాసాల్లో తేలిపోతున్నాడు. మరి నామీద దయలేదేమి?' అని. అందుకు భగవంతుడు- 'నాయనా! నీ మిత్రుడు ఐశ్వర్యమే కోరుకున్నాడు. ఇచ్చాను. సుఖశాంతుల ప్రస్తావన లేదు. అందుకే అవి ఇవ్వలేదు. నీపై కరుణ ఉన్నది. కనుక నేన్నీకు సంపదనివ్వక సంతృప్తినీ, సుఖశాంతుల్నీ ఇస్తున్నాను అని బదులిచ్చినట్లు కథ.

లోభి అయిన సంపన్నుడు సాగరం లాంటివాడు. దాహం తీర్చలేడు, సమాజానికి పనికిరాడు. దరిద్రుడైనా దానగుణమున్నవాడు చెలమ వంటివాడు. ఆప్తుల్ని ఆదుకొనే మానవోత్తముడు. శ్రమవెంట మనం పడాలి. సుఖం మన వెంట పడుతుంది. ధనహీనుడు దరిద్రుడు కాడు. భక్తిహీనుడే దరిద్రుడు. జ్ఞానహీనుడే దరిద్రుడు. సంస్కారహీనుడే దరిద్రుడు. అధార్మికుడే దరిద్రుడు. ఈ సత్యం గ్రహించగలిగితే- ధర్మబద్ధమైన ధనార్జనకే సంసిద్ధులమవగలం.

Wednesday, March 24, 2010

చురుకైన పిల్లలు పుట్టాలంటే.. ఏం చేయాలి ?




గర్భిణి ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. వీలైనంత వరకు వారిచేత ఏ పని చేయించకూడదు అనుకుంటారు. కానీ గర్భిణులు చలాకీగా తిరుగుతూ చిన్నచిన్న పనులు చక్కబెట్టుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో తెలివితేటలు అమోఘంగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కెనడా యూనివర్సిటీకి చెందిన వైద్యులు ఆ విషయాన్నే తమ అధ్యయనం ద్వారా తేల్చి చెప్పారు.

గర్భిణులు వారానికి మూడుసార్లు వ్యాయామాలు చేయడం, సానుకూల ధోరణిలో ఆలోచనలు చేయడం వల్ల చురుగ్గా ఉండగలుగుతారు. వారేకాదు వారికి పుట్టబోయే పిల్లల్లోను చురుకుదనం, జ్ఞాపకశక్తి పెరుగుతాయని పరిశీలనలు చెబుతున్నాయి. పాతికేళ్ల నుంచి ముప్ఫైఏళ్ల లోపు గర్భిణుల ఆహారపు అలవాట్లు, దినచర్యలు గమనించాక ఈ విషయం స్పష్టమైంది. మంచి ఆహారం అంటే చేపలు, తృణధాన్యాలు.. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకున్న వారే ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తారు. అయితే గర్భిణుల వ్యాయామాలకు అధిక శ్రమ పనికిరాదు. వైద్యుల సలహాతోనే వాటిని చేయాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి. కొందరికి వ్యాయామం చేసేప్పుడు శరీరం సహకరించదు. ఇతరత్రా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అవన్నీ ఆ వ్యాయామం మీకు సరిపడదని తెలిపే సంకేతాలు. వాటిని గమనించి తక్షణం ఆపేయాలి. ఉదయం ఆరు నుంచి ఏడు గంటల సమయంలోనే ఈ వ్యాయామాన్ని పూర్తి చేసుకోవడం మంచిది.

Friday, March 12, 2010

నాకు పెళ్లయ్యేలా చూడుస్వామీ!

చిలుకూరు బాలాజీ గుడికెళ్తే వీసా త్వరగా దొరుకుతుందంటారు. పిల్లలు పుట్టని వాళ్లు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తారు. మరి, ముప్పైలు దాటిపోతున్నా పెళ్లి కాని వారి కోసం అలాంటి ప్రత్యేక ఆలయాలేవైనా ఉన్నాయా అంటే... తమిళనాడులో అలాంటివి పదకొండు గుళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ ఒకేసారి చుట్టబెట్టేలా ఆ రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేకంగా ఓ ప్యాకేజీనే ఏర్పాటు చేసింది.
'తిరుమణ తిరుతల సుట్రుల్లా'

తమిళనాడులో ఇప్పుడు పెళ్లికాని అమ్మాయిలూ అబ్బాయిలు పఠిస్తున్న తారకమంత్రం ఇది.

'కల్యాణ క్షేత్రాల పర్యటన' సదరు మంత్రానికి అచ్చతెలుగు అనువాదమిది. అనగా... వివాహాలకు అడ్డొచ్చే విఘ్నాలను తొలగించి త్వరగా పెళ్లయ్యేలా దీవించే దేవుళ్లున్న క్షేత్రాల పర్యటన అన్నమాట.

ఆలయాల గడ్డగా పేరొందిన అరవదేశంలో అలాంటివి పదకొండు గుడులు ఉన్నాయి. పెళ్లికాని వారంతా ఏవరికి వారు విడివిడిగా ఆయా క్షేత్రాలకు వెళ్లడం కద్దు. వారి అవస్థలు చూసిన టీటీడీసీ(తమిళనాడు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ .్మ్మ్ట్ఞ్న్థ్ద్ౖథ్ఠ.్ఞ్న్ఝ) ఈ ప్యాకేజీకి రూపకల్పన చేసింది.
ఏమేం ఆలయాలంటే...
మూడు రోజుల యాత్రలో భాగంగా తీసుకెళ్లే క్షేత్రాలివీ...
ముదిచూర్‌: తాంబరం (చెన్నై)లోని ముదిచూర్‌ ఆలయ దర్శనంతో యాత్ర వెుదలవుతుంది. హరిహరులిద్దరూ కొలువైన ఈ ఆలయంలో ప్రధాన దైవం విద్యాంబిగై అమ్మవారు. పెళ్లి కాని వారు ఈ గుడిలో ప్రార్థన చేస్తే త్వరగా కల్యాణయోగం సిద్ధిస్తుందని నమ్మిక.
తిరువిడనత్త్తె: మహాబలిపురం వద్ద వెలసిన లక్ష్మీవరాహస్వామి ఆలయం... తిరువిడనత్త్తె. ఇక్కడ అమ్మవారు కోమలవల్లీ తాయారు. త్రేతాయుగంలో కలవుడు అనే మహర్షికి పుట్టిన 360 మంది కూతుళ్లనూ విష్ణుమూర్తి వివాహమాడినట్టు స్థలపురాణం. వరాహరూపంలో సతీసమేతంగా కొలుటవైన ఈ స్వామిని నిత్యకల్యాణ పెరుమాళ్‌గా వ్యవహరిస్తారు భక్తులు.
తిరుమణంజేరి: శివుడు కల్యాణసుందరేశ్వరర్‌గా పూజలందుకుంటున్న పవిత్ర క్షేత్రం తిరుమణంజేరి. శివపార్వతుల కల్యాణం జరిగింది ఇక్కడేనని ప్రతీతి.
ఉప్పిలియప్పన్‌: అంటే ఉపమానాలకు అందనివాడు, అనుపమానుడు అని అర్థం. ఇది వైష్ణవక్షేత్రం. స్థానికుడైన మార్కండేయన్‌ అనే వ్యక్తికి పుట్టిన భూదేవి 'కోకిలాంబాళ్‌' పేరుతో పెరిగి శ్రీమహావిష్ణువును పెళ్లిచేసుకుందని ప్రతీతి. అందుకే ఈ ఆలయమూ కల్యాణాలకు ప్రసిద్ధి.
నాచ్చియార్‌ ఆలయం: విష్ణుమూర్తి నరైయూరు నంబిగా అమ్మవారు నాచ్చియార్‌గా కొలువైన దేవళం ఇది. విష్ణుమూర్తి 108 దివ్య దేశాల్లో ఒకటి.
తిరుకరుకావూర్‌: ఇక్కడి అమ్మవారు గర్భరక్షాంబిగై.పెళ్లికాని, పెళ్లయినా పిల్లలు పుట్టని మహిళలు ఈ తల్లిని దర్శించుకుంటారు. ఇక్కడి శివలింగం పుట్టమన్నుతో తయారైంది. అందుకే అభిషేకం చేయరు. పునుగు సుగంధ ద్రవ్యాన్ని మాత్రం అద్దుతారు.
తిరుచ్చేరై: ఇది కూడా 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటి. విష్ణువు శ్రీదేవీభూదేవీ సమేతంగా 'సారనాథుడు'గా కొలువుదీరిన క్షేత్రం. ఇక్కడ అమ్మవారు సారనాయకి. కావేరీ నది ఆ హరిని పెళ్లాడింది ఇక్కడేనని స్థలపురాణం.
మదురై: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం. పాండ్యరాజు తన కుమార్తె మీనాక్షిని చొక్కనాథుడైన శివుడికి ఇచ్చి పెళ్లి చేసిన చోటు. పెళ్లికాని అమ్మాయిలు మదుర మీనాక్షిని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.
తిరునల్లూరు: శివుడు పంచవర్ణేశ్వరుడిగా కొలువైన క్షేత్రమిది. ఈ స్వామిని కల్యాణ సుందరేశ్వరుడిగా కొలుస్తారు భక్తులు. శివపార్వతుల కల్యాణాన్ని అగస్త్యుడు ఇక్కణ్నుంచే చూశాడని పురాణప్రవచనం.
తిరువేడగం: వైగై నదీ తీరాన కొలువుదీరిన శైవక్షేత్రమిది. ఇక్కడ స్వామిని ఏడగనాథర్‌ పేరుతో కొలుస్తారు. అమ్మవారు ఇలావర్‌ కులాలి అమ్మై.
తిరువీళిమిళలై: శివుడు కాత్యాయనీ దేవిని వివాహం చేసుకున్నట్టు చెప్పే పవిత్ర క్షేత్రమిది. ఇక్కడ ఈశ్వరుడు వీళినాథుడు.
ఎంత, ఎలా...
ఈ కల్యాణ క్షేత్రాల యాత్రకు రుసుము రూ.1800. మధ్యలో బసచేసే చోట హోటల్‌ గదిని ఇంకొకరితో కలిసి పంచుకుంటానంటే రూ.1400 సరిపోతాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దర్శనం రుసుము అన్నీ అందులోనే. ప్రతి శుక్రవారం ఉదయం ఆరుగంటలకు చెన్నైలో టూరు వెుదలవుతుంది. మళ్లీ సోమవారం నాటికి అన్ని క్షేత్రాలూ దర్శించుకుని ఎక్కినచోటే దిగొచ్చు.

కొసమెరుపు: పర్యాటక శాఖవారు ఏ ఉద్దేశంతో ఈ టూరును ఏర్పాటు చేసినా పెళ్లికాని వారి ఆలోచనలు మాత్రం ఇంకో రకంగా ఉన్నాయి. 'అదృష్టం బాగుంటే... మనతోపాటే బస్సులో ఎక్కిన అమ్మాయో/అబ్బాయో ఈ మూడురోజుల్లో కాస్త దగ్గరై, ఆనక భాగస్వామి అయినా అయిపోవచ్చు కదా' అని ఆశపడుతున్నారు.

- courtesy : eenadu sunday

Monday, March 8, 2010

శనిశ్వరుడికి భయపడేవాళ్ళ కోసం ఈ పోస్ట్ !



శనిత్రయోదశి నాడు శనైశ్చరుని భక్తితో కొలిచినవారికి శుభాలనొసగుతాడనీ 'ఏలిననాటి శని దశ' వారిని అంతగా బాధించదనీ పురాణాలు చెబుతున్నాయి. (ఈ నెల పదమూడు శనిత్రయోదశి)

శనయే క్రమతి సః... నెమ్మదిగా చరించేవాడు శని అని పురాణోక్తి. శనిగ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమించేందుకు పట్టే కాలం 30 సంవత్సరాలు. అదే మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగేందుకు పట్టే కాలం 24 గంటలు. అంత నెమ్మదిగా కదిలేవాడు కాబట్టి శనీశ్వరుణ్ని 'మందుడు' అన్నారు మహర్షులు. నవగ్రహాల్లో ఏడోవాడైన శనీశ్వరుడు జీవరాశులను సత్యమార్గంలో నడిపించేందుకే అవతరించాడని ప్రతీతి.

జన్మవృత్తాంతం
పద్మపురాణం, స్కాందపురాణం, సూర్యపురాణం... ఇలా అనేక పురాణాల్లో శనీశ్వరుని జన్మవృత్తాంతం, ఆయన మహిమల గురించి కనిపిస్తుంది. వాటిప్రకారం త్వష్టప్రజాపతి(విశ్వకర్మ) కుమార్తె అయిన సంజ్ఞ సూర్యుని భార్య. వారికి వైవస్వతుడు (ప్రస్తుత మనువు ఈయనే), యముడు, యుమున అనే ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ, ఎంతోకాలం సూర్యుడి తేజస్సుని భరించలేకపోయిన సంజ్ఞ తన నీడకు ప్రాణం పోసి 'ఛాయ' అని పేరుపెట్టి ఆమెను తన స్థానంలో ఉంచి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయిందట. నాటి నుంచి ఛాయాదేవి సూర్యునకు ఏమాత్రం అనుమానం కలగకుండా సంజ్ఞాదేవిలాగానే ప్రవర్తిస్తూ ఉండేదట. సూర్యుడికి ఛాయదేవి వలన సావర్ణుడు, శని, తపతి జన్మించారు. శని తన కడుపున ఉండగా ఛాయాదేవి ఈశ్వరుని గురించి తపస్సు చేసిందనీ... ఆమె కఠోరదీక్ష వల్ల కడుపులో ఉన్న శని నల్లగా అయిపోయాడనీ కానీ అదే దీక్ష వల్ల అనేక ఈశ్వర శక్తులు లభించి శనీశ్వరుడుగా పేరు పొందాడనీ ఒక కథనం.

సూర్యుడి వరం కారణంగా శని మకర, కుంభరాశులకూ నవగ్రహాలకూ అధిపతి అయ్యాడని పురాణోక్తి. శనీశ్వరుడి వాహనం కాకి. నలుపు రంగు, నల్లనువ్వులు, జిల్లేడు ఆకులను ఇష్టపడతాడనీ తైలాభిషేకప్రియుడనీ చెబుతారు. లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి(ఈమెనే దరిద్రదేవత అంటారు) శనైశ్చరుడి భార్య. అంటే శనిభగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అన్నమాట. శనిదూషణ సర్వదేవతలనూ తిట్టినదాంతో సమానం అని పెద్దలు చెబుతారు. ఆయనను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనైశ్చరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం. అందుకే హనుమత్‌దీక్షలో ఉన్నవారినీ అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులనూ ఆయన బాధించడని నమ్మిక.

న్యాయాధికారి
మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గనరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.

courtesy : eenadu sunday