Pages

Thursday, February 18, 2010

మనిషి నిర్లక్ష్యమ్ చేయకూడని 10 లక్షణాలు

ఛాతీనొప్పి, కడుపునొప్పి వంటివి వచ్చినపుడు మనం వెంటనే డాక్టర్‌ దగ్గరికి పరుగెడుతుంటాం. కానీ బరువు తగ్గటం, కొద్దిగా తినగానే కడుపు నిండటం, హఠాత్తుగా తలనొప్పి రావటం వంటి వాటిని అంతగా పట్టించుకోం. అయితే అలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని, అందుకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ కారణమయ్యే అవకాశమూ ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం.

1. బరువు తగ్గటం: ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా బరువు తగ్గుతుంటే ఏదో ఒక సమస్యకు సూచన కావొచ్చని అనుమానించాలి. ఆర్నెళ్లలో 10% బరువు తగ్గితే (ఉదా: 60 కిలోలు ఉన్నవారు 6 కిలోలు) వెంటనే డాక్టర్‌ని సంప్రదించటం మేలు. దీనికి థైరాయిడ్‌, కుంగుబాటు, కాలేయవ్యాధి, క్యాన్సర్‌, పోషకాలను గ్రహించటంలో శరీరంలో ఇబ్బందులు ఏర్పడటం వంటివి కారణం కావొచ్చు.

2. విడవకుండా జర్వం: మన శరీరం వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతున్నప్పుడు సాధారణంగా జ్వరం వస్తుంటుంది. అయితే మూడు రోజులపాటు గానీ అంతకన్నా ఎక్కువరోజులు గానీ తక్కువ స్థాయిలో (102 డిగ్రీల ఫారన్‌హీట్‌ కన్నా ఎక్కువ) విడవకుండా జ్వరం ఉంటున్నా.. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం (104 డిగ్రీల ఫారన్‌హీట్‌ కన్నా ఎక్కువ) వస్తున్నా జాగ్రత్త పడాలి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల వంటివి కూడా విడవకుండా జ్వరం రావటానికి కారణం కావొచ్చు. క్యాన్సర్ల వంటి జబ్బులూ ఇందుకు దోహదం చేస్తాయి.

3. శ్వాసలో ఇబ్బంది: జలుబు చేసినప్పుడో, వ్యాయామం చేస్తున్నప్పుడో శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటం సహజమే. కానీ మామూలు సమయాల్లో శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటే మాత్రం అనుమానించాల్సిందే. ముఖ్యంగా పడుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటే నిర్లక్ష్యం చేయరాదు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఏర్పడటానికి దీర్ఘకాలంగా శ్వాసకోశవ్యాధులు, బ్రాంకైటిస్‌, ఉబ్బసం, న్యుమోనియా, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టటం, గుండె జబ్బుల వంటివి కారణం కావొచ్చు.

4. మలవిసర్జనలో మార్పులు: రోజుకి మూడుసార్ల నుంచి వారానికి మూడుసార్లు మల విసర్జన జరుగుతుంటే సాధారణ స్థితిగానే పరిగణించొచ్చు. అందుకు విరుద్ధంగా ఏవైనా లక్షణాలు కనిపిస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మలంలో రక్తం పడటం, వారానికి పైగా అతిసారం, మూడు వారాల పాటు మలబద్ధకం, నల్లగా గానీ రంగుతో కూడిన మలం, హఠాత్తుగా మల విసర్జన అవుతుండటం వంటివి గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇలాంటి లక్షణాలకు బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు.. పేగుల్లో పూత, పెద్దపేగు క్యాన్సర్‌ వంటివి దోహదం చేస్తుండొచ్చు.

5. ప్రేలాపన (డెలీరియమ్‌): ఉన్నట్టుండి ఏదేదో మాట్లాడటం, అయోమయానికి గురికావటం వంటివి గమనిస్తే తేలికగా తీసుకోరాదు. సమయం, స్థలాలను గుర్తించటంలో తికమకపడటం, అకారణం కోపం, ఏకాగ్రత కోల్పోవటం, జ్ఞాపకశక్తి నశించటం, ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే అలక్ష్యం కూడదు. ఇన్‌ఫెక్షన్లు, రక్తహీనత, రక్తంలో చక్కెర తగ్గటం, మానసిక సమస్యల వంటివి వీటికి దోహదం చేస్తుండొచ్చు.

6. తీవ్రమైన తలనొప్పి: తలనొప్పి సాధారణంగా వచ్చేదే అయినా హఠాత్తుగా తీవ్రంగా వస్తే మాత్రం ఇతరత్రా సమస్యలకు సూచిక కావొచ్చు. తలనొప్పితో పాటు జ్వరం, మెడ బిగుసుకుపోవటం, దద్దు, అయోమయం, మూర్ఛ వస్తుంటే వెంటనే చికిత్స ప్రారంభించాలి. 55 ఏళ్లు దాటిన తర్వాత కొందరికి కణతల్లో ధమనివాపు వల్ల కూడా కొత్తరకం తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. మెదడులో ట్యూమర్‌ ఏర్పడినా తలనొప్పి రావొచ్చు.

7. హఠాత్తుగా చూపు, మాట కోల్పోవటం: ఇలాంటి లక్షణాలు పక్షవాతానికి హెచ్చరిక కావొచ్చు. శరీరంలో ఒకవైపు హఠాత్తుగా బలహీన పడటం, మొద్దుబారటం.. చూపు మసక బారటం, పూర్తిగా కోల్పోవటం.. మాట పోవటం, ఇతరుల మాటలను అర్థం చేసుకోలేకపోవటం.. మగతగా అనిపించటం, తూలి పడటం వంటివి గుర్తించినపుడు ఏమాత్రం ఆలస్యం చేయరాదు.

8. కళ్లముందు మెరుపు: హఠాత్తుగా కంటి ముందు మెరుపులాంటి కాంతి కనిపిస్తే తీవ్రమైన సమస్యకు గుర్తు కావొచ్చు. కంటి వెనక పొర నుంచి రెటీనా విడిపోయినప్పుడు ఇలా కనిపిస్తుంది. తక్షణం చికిత్స చేస్తే శాశ్వతంగా చూపు పోయే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.

9. కొద్దిగా తిన్నా కడుపు నిండటం: ఇలాంటి లక్షణం వారం పాటు కనిపిస్తే వెంటనే డాక్టర్‌కి చూపించుకోవాలి. దీనికి వికారం, వాంతి, త్రేన్పులు, జ్వరం, బరువు తగ్గటం/పెరగటం వంటివీ తోడైతే ఇబ్బంది ముదిరినట్టే. అన్నవాహిక క్యాన్సర్‌, జీర్ణాశయ సమస్యలు ఈ లక్షణాలకు కారణం అవుతుండొచ్చు.

10. కీళ్ల వాపు, నొప్పి: కీళ్లల్లో ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఇలాంటివి కనిపించొచ్చు. దీనికి గౌట్‌ వ్యాధి, కొన్ని రకాల కీళ్లవాపులు కూడా దోహదం చేస్తాయి.

-courtesy: eenadu sukibhava

Monday, February 15, 2010

ప్రేమ - కొన్ని డవుట్లు, నిజాలు, ఐడియాలు, ఓ పిట్టకథ

ప్రేమ గురించి మాట్లాడమంటే ప్రతి ఒక్కరు రచయితలు అవుతారు. వక్తలు అవుతారు. జీవం ఉన్న ప్రతి మనిషిలో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ భావన తప్పకుండా కలుగుతుంది. ప్రేమికుల రోజు సందర్బంగా సాక్షి ఫండే ప్రత్యేక సంచిక విడుదల చేసింది. అందులో నేను రాసిన కొన్ని డవుట్లు, నిజాలు, ఐడియాలు, ఓ పిట్టకథ మీ కోసం ఈ కింది బ్లాగ్ లో పెట్టాను . చదివి నవ్వుకోండి, ఆలోచించుకోండి, ఎంజాయ్ చేయండి


http://rathalukothalu.blogspot.com/

Thursday, February 4, 2010

ఒక వ్యక్తి శక్తిగా ఎదగగలడు!!

మహానది ఒక బిందువుగానే ప్రారంభమవుతుంది. ఒక బిందువే సమస్త విశ్వంగా విస్తరిస్తుంది. తల్లి కడుపులో బిడ్డ ఒక బిందువుగానే ఉత్పన్నమవుతుంది. మొదట వేసిన ఒక్క అడుగే వేలాది అడుగులుగా మారి గమ్యాన్ని చేరుస్తుంది. మర్రి బీజం ఆవగింజంతైనా ఉండదు. అదే మర్రి వృక్షరాజంగా విరాజిల్లుతుంది. అలాగే ఒక వ్యక్తి శక్తిగా ఎదగగలడు. మహాశక్తిగా మారగలడు. అది వెలికితీసిన దివ్యత్వమే.

ఎప్పుడూ మన కోసమైన దాన్ని మనమే భద్రపరచాలి. మనమే శుభ్రపరచాలి. దాని ఉన్నతికోసం, ఉజ్జ్వలత కోసం, ఉద్దేశ సాఫల్యతకోసం మనమే కృషిచేయాలి. ఈ ఇల్లు మనది. ఈ కుటుంబం మనది. ఈ ఊరు, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచం, విశ్వం... అన్నీ మనవే. మనిషి కుదించుకుని ఉన్నప్పుడే, కుంచించుకుని ఉన్నప్పుడే 'నేను' అనే అతి చిన్న పరిధిలో ఉంటాడు. తనను తాను, తన బుద్ధిని, హృదయాన్ని విస్తరించుకుంటూ పోయే కొలదీ ఆ పరిధి చిన్నచిన్నగా, పెద్దగా, మరింత పెద్దగా, అనంతంగా విస్తరించుకుంటూ పోయి ఏకాత్మ భావనలో లయమైపోతుంది. విలీనమైపోతుంది. ముందు నేను, నాదిలోంచి విస్తరిస్తూ మనం, మనదిగా విస్తృతమై మనంలోంచి 'మనం' అనే అనేకాన్ని జయించి- నేను నా అనే సువిశాల నిజ అనంతంలోకి, ఏకత్వంలోకి లయం చేస్తూ ఆత్మభావంలో స్థిరపడిపోవాలి.

మనం మన గదిలో ఉన్నప్పుడు మన కుటుంబీకులతో 'నా గది' అంటాం. పక్కింటివాళ్లతో ఇంటిని 'మా ఇల్లు' అంటాం. వీధులకు సంబంధించి 'మా వీధి' అంటాం. అలాగే వూరు, దేశం, ప్రపంచం. సంకుచితత్వాన్ని వదలిపెడితే సర్వం 'నేనే' అనే భావనలో లీనమైపోతాం. ఈ భావం ఆత్మకే కాదు. ఆధ్యాత్మికతకే కాదు. సామాజిక జీవితానికీ వర్తిస్తుంది. ఈ ప్రపంచంలో జన్మ తీసుకున్న మనం ఈ ప్రపంచానికి, ఈ సమాజానికే చెందినవారం. ఈ ప్రపంచం కోసమే మనం జీవించాలి. దానికోసమే మరణించాలి.

మన శరీరానికి జబ్బు చేస్తే మనమే చికిత్స చేసుకుంటాం. ఎవరో చేయాలనో, చేయించాలనో సాధారణంగా ఆశించం. సమాజానికీ అంతే. అది మనది. ఏం చేసినా మనమే చేయాలి. ఈ సువిశాల విశ్వం, ఈ ప్రపంచం... ఇందులో నేనెంత! ఒక చిన్న వూరు. ఆ వూళ్లో చిన్న ఇల్లు. చిన్న కుటుంబం. అందులో నేనొకణ్ని. ఒకానొక అర్భకుణ్ని. సముద్రంలో ఒక నీటిబిందువును. భూమండలంలో ఒక మట్టి రేణువును. అణువును. కానీ, తెలుసా? ఒక అణువే ఆటంబాంబు అవుతుంది. ఒక బిందువే సింధువుగా మారుతుంది. ఒక చిన్న చిట్టెలుక... కొండను తవ్వగలదు. కాళ్లూ చేతులూ లేని చిరు చేప... సముద్రాన్ని ఈదగలదు. ఒక చిన్నారి పక్షి... ఆకాశాన్నే ఏలగలదు. మనిషి... ఆ పరాత్పరుణ్నే ఒక ఆచమనంతో ఔపోసన పట్టగలడు. ఇది ఆశ్చర్యమే. అద్భుతమే. కానీ వాస్తవం.

ఏ వ్యక్తీ 'నేనొక్కణ్ని. అర్భకుణ్ని. నేనేం 'చేయగలను?' అని భీతి చెందకూడదు. మనం శరీరానికి అర్భకులం కావచ్చు. ధనానికో, వయసుకో అర్భకులం కావచ్చు. కానీ ఆత్మవిశ్వాసానికి అర్భకులం కాదు. ఆత్మ స్త్థెర్యానికి అర్భకులం కాదు. మనిషి ఏ స్థితిలో ఉన్నా ధృతి, ధీశక్తి పోగొట్టుకొనే అవకాశం ఉంది. ఇంకా ప్రోది చేసుకునే అవకాశం ఉంది.

మనిషెప్పుడూ ఒక్కడు కాదు. ఒంటరి కాదు. ఆత్మ తోడుగా ఉంది. అనంతశక్తి తోడుగా ఉంది. ప్రాపంచికమైన తోడును పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదంటారు రామకృష్ణులు. నీకు ఎవరు; ఎందరు తోడున్నా ఎవరూ లేరనే అభిప్రాయంతోనే ఒంటరిగా నీ పనిలో నిమగ్నుడవు కమ్మంటారు. జగజ్జనని మాత్రమే తోడుగా ముందుకు సాగమంటారు. ఎంత గొప్పగా ఉంది! నిజమే. ఎవరైనా ఎందరైనా మనకు తోడుగా ఉండనీ. మంచిదే. కానీ ఎవరి సహకారమైనా మనం ఎందుకు ఆశించాలి? వాళ్ల వెన్నుదన్నుకోసం బెరుగ్గా ఎందుకు వెనక్కు వెనక్కు చూడాలి? మన శక్తిమీద, మనోస్త్థెర్యం మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగటం ప్రారంభిస్తే, మనం నడిచే దారి మంచిదైతే, గమ్యం సరియైునదైతే- మన వెనక అడుగుల చప్పుడు మనకు వినబడుతుంది. మన గుండె చప్పుడులో కలిసిపోతుంది. మహాత్మాగాంధీ, మండేలా, మదర్‌ థెరెసా... ఒక్కరా ఇద్దరా! ప్రపంచాన్నే తమ వెంట నడిపించిన ఒంటరి పధికులు. ఆసేతు హిమాచలం ఎన్నోసార్లు పాదచారియైు పర్యటించి అంతరించిపోతున్న ఆధ్యాత్మికతను పునరుద్ధరించి, అనేక శక్తిపీఠాలను స్థాపించి, అద్వైతాన్ని మకుటాయమానంగా నిలిపిన శంకరాచార్యులు నూనూగు మీసాలైనా రాని బాల సన్యాసి. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి పెట్టిన గాంధీజీ అర్భక అర్ధనగ్న చక్రవర్తి. డెబ్భైఏళ్లు దాటాకే ప్రభుపాద స్వామి, ఒంటరిగా కట్టుబట్టలతో అమెరికాలాంటి భౌతికవాద దేశంలో కాలుమోపి 'హరేరామ హరేకృష్ణ' ఉద్యమాన్ని వారి సొంతమే అని వారు భావించేంతలా ఉద్ధృతంచేసి, వందలాది 'ఇస్కాన్‌టెంపుల్స్‌' నిర్మించి, పిట్స్‌బర్గ్‌ దగ్గరలో వారి ఇష్టంతో వారే తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి గోల్డెన్‌ పాలెస్‌ నిర్మింపజేసుకున్న అనితర సాధ్యుడు. ఎందరు... ఎందరు ఎందరో మహానుభావులు. ప్రయత్నమే వారి విజయ ప్రకటన. వారి సంకల్పమే వారికి తోడు. లోక కల్యాణమే వారికి సిరి, వూపిరి.

నేడు లోకంలో ఎంతో స్వార్థం, దౌష్ట్యం, అవినీతి, కష్టాలు, కన్నీళ్లు... దీన్నిలాగే వదిలేద్దామా? మనదైన ఈ లోకాన్ని ఈ సమాజాన్ని, కనీసం ఈ దేశాన్ని, కనీసం ఈ రాష్ట్రాన్ని, కనీసం... చుట్టూ ఉన్న మన పొరుగువారినైనా క్షేమంగా, సౌకర్యవంతంగా ఉండేలా మనమెందుకు ప్రయత్నించకూడదు? అందుకు ఏదో, ఏమిటో, ఎంతో అవసరం లేదు. అందుకు కావలసింది బిగించిన ఒక ఉక్కు పిడికిలి. దానికి ఆ శక్తినిచ్చే వజ్రసదృశ సంకల్పం. మనం ఒంటరివాళ్ళం కూడా కాదు. తెలీని కొత్తదారీ కాదు. మనముందు ముళ్లూ, పల్లేళ్లూ తొక్కుతూ ఎందరో ధీమంతులూ, త్యాగధనులూ నడిచి, విడిచి, వెళ్లిన అడుగు జాడలున్నాయి. వారి విజయాల జ్యోతులు మన దారి వెలుతురుకై వెలుగుతున్నాయి.
- - చక్కిలం విజయలక్ష్మి
- - courtesy : eenadu