మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. నేను సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేస్తాను. అతనిది వ్యాపారం. అప్పుడే పెళ్లిచేసుకోవాలని అనుకోకపోయినా.. మంచివాడు, అందగాడు.. అని అంగీకరించాను. అలా ఏడాది క్రితం పెళ్లయ్యింది. మిగతా కుటుంబసభ్యులందరూ వూళ్లో ఉండటంతో ఇద్దరం సొంత సంసారాన్ని మొదలుపెట్టాం. అక్కడినుంచే మా ఇద్దరిమధ్యా చిన్నచిన్న మనస్పర్థలు మొదలయ్యాయి. ఇంటికి అవసరమైన వస్తువుల్లో ఫలానా కంపెనీ ఫ్రిజ్ బాగుంటుందంటే.. లేదంటూ మరో పేరు చెప్పేవారు. వెంటనే కొనుక్కొచ్చేసేవారు. అదొక్కటే కాదు.. రంగులు, వంటింటి సామగ్రి.. చివరకు డోర్‌మ్యాట్ల ఎంపిక.. ఇలా ప్రతిదాంట్లో ఇద్దరి ఆలోచనలు వేర్వేరని క్రమంగా అర్థమయ్యింది. అభిరుచులూ అంతే. నాకేమో చిన్నచిన్న సరదాలు. వాటి గురించి ఆనందంగా వివరిస్తుంటే.. నవ్వేసి తేలిగ్గా తీసుకునేవారు. ఇలాంటివన్నీ మా ఇద్దరిమధ్యా తెలియకుండానే దూరాన్ని పెంచుతున్నాయని ఏడాది తర్వాత గ్రహించాను. ఇదే కొనసాగితే.. పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని.. స్నేహితురాలు ఓ సందర్భంలో సలహా ఇవ్వడంతో.. ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అనుకోకుండా అతనిలోనూ చిన్నచిన్న మార్పులు కనిపించడంతోపాటు.. నా ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం ఇంకా పెరిగింది. ఇంతకీ ఏం చేశామంటే..
మేం చేసిన మొదటిపని.. ఒకరి అభిరుచుల్ని ఒకరు గౌరవించడం నేర్చుకున్నాం. గతంలోలా.. ఏదైనా చెబితే నవ్వుకోవడం.. లేదా అందరిముందు ఆ విషయాన్ని ప్రస్తావన తీసుకురావడం లాంటివన్నీ పూర్తిగా తగ్గించేశాం.
తనకు తీరిక వేళల్లో పెయింటింగ్ వేయడం చాలా ఇష్టం. నాకు చిన్న గీత కూడా గీయడం రాదు. ఆ ఆసక్తిని గమనించిన నేను.. అప్పుడప్పుడు కాన్వాస్, రంగుల్ని కానుకగా ఇవ్వడం మొదలుపెట్టా. అంతేనా.. తను వేసిన పెయింటింగ్‌లను ప్రదర్శనలో ఉంచడానికి ఏర్పాటుచేశా. ఆ రోజు తన ఆనందం వర్ణనాతీతం.
ఇద్దరూ కలిసి షాపింగ్‌చేయడం నాకు చాలా ఇష్టం. అలా అడిగినప్పుడల్లా.. 'ప్లీజ్! నువ్వే తీసుకురా. నాకు కుదరకపోవచ్చు..' అంటూ సున్నితంగా తప్పించుకునేవారు. ఇలా కాదని చెప్పి.. చిన్నచిన్న పనులు నేనే చేసుకున్నా.. మీకు కుదిరినప్పుడే వెళ్దామంటూ చెప్పేదాన్ని. నొప్పించకుండా చెప్పడంతో.. కొన్నిరోజులకు ఆయనే.. వీలుకల్పించుకుని వచ్చేవారు. ఇప్పుడు కూరగాయల కోసమైనా సరే.. ఇద్దరం కలిసే వెళ్లడం మాకు అలవాటయ్యింది.
నాకేమో.. వివిధ ప్రాంతాల వంటలపుస్తకాలను కొనడం ఓ అలవాటు. నన్నో వింతగా చూసేవారు ఆయన. వ్యాపారంలో భాగంగా ఎక్కడికైనా వెళ్తే.. ఆ ప్రాంతపు వంటకాలున్న పుస్తకాన్ని తెచ్చివ్వమని అడిగేదాన్ని. ఒకటిరెండుసార్లు గుర్తుచేసి తెప్పించుకున్నా. క్రమంగా అడక్కుండానే తేవడం మొదలుపెట్టారు. ఇప్పుడు నా దగ్గర బోలెడు పుస్తకాలున్నాయి.
ఒక్క వారాంతంలో తప్ప.. మిగిలిన రోజుల్లో మాంసాహారం వండటం.. నాకు ఇబ్బందిగా అనిపించేది. ఉద్యోగ హడావుడే అందుక్కారణం. దాంతో బయట తినడానికి అలవాటుపడ్డారు. ఆ సమస్యను తగ్గించడానికి.. సులువుగా అయిపోయే వివిధ ప్రాంతాల వంటకాలను గుర్తించి చేయడం మొదలుపెట్టా. వెరైటీ వంటకాలు.. ఆయనచేత రెస్టరంట్లకు వెళ్లే అలవాటును దాదాపు తగ్గించాను.
- సంధ్య
No comments:
Post a Comment