రసాయనిక మందుల వాడకంతో వాతావరణంలో పెను మార్పులు. పంట నష్టాలు.. క్యాన్సర్ మరణాలు. ఈ దుష్పరిణామాలను గమనించిన ఓ మహిళ... నిర్విరామ పరిశోధనతో వాటికి ప్రత్యామ్నాయాలను కనుగొంది. సహజసిద్ధమైన మందులను తయారుచేసింది. ఈ మధ్యనే జాతీయ పర్యావరణ అవార్డు... ప్రతిష్ఠాత్మక నాబ్స్ ఫెలోషిప్‌ను సాధించిన ఆ శాస్త్రవేత్తే... హైదరాబాద్‌కి చెందిన ఉషారాణి.
పంటలను కాపాడుకోవాలి, అధిక దిగుబడులు సాధించాలి... అనేదే రైతన్నల తపన. ఆ ప్రయత్నంలో, తెలిసి కొందరు, తెలియక ఎందరో రసాయనిక పురుగుమందులను వాడుతుంటారు. అలా మితిమీరే వాడకంతో పర్యావరణానికి, పంటలకు, మానవులకు ఎదురయ్యే ప్రమాదం గురించి ఉషారాణి కలవరపడ్డారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తగా సహజ పురుగు మందుల తయారీకి నడుంకట్టారు. మొక్కల్లోని సహజ రసాయనాలతో ఏ మాత్రం ప్రమాదం లేని ఆరు రకాల పురుగుమందుల్ని కనిపెట్టారు.
మూడు దశాబ్దాలుగా పరిశోధనల్లో నిమగ్నమైన ఉషారాణిపై తండ్రి ప్రభావం అధికం. 'మా నాన్న స్వాతంత్య్ర సమరయోధుడు. చిన్నప్పట్నుంచి సరైన మార్గనిర్దేశం అందించారు. ఏ పని చేసినా సమాజానికి ఉపయోగపడేది చెయ్యాలి నువ్వు అంటూ పదేపదే చెప్పేవారు.ఆ ప్రభావంతోనే పరిశోధన రంగంలో అడుగుపెట్టాను' అని వివరించారామె. పీజీ పూర్తయ్యాక ఉద్యోగం చేసే పలు అవకాశాలు ఎదురొచ్చాయి. కానీ కాసుల కన్నా కలకాలం నిలిచిపోయే పరిశోధనలే ప్రాణం అనుకున్నారు. పెళ్లయ్యాక భర్త సహకారంతో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. 'పరిశోధనల నిమిత్తం జపాన్ వెళ్లడం కీలక మలుపు. అక్కడ నలభై దేశాల వారితో పరిచయాలు మానసికంగా ఎంతో ధైర్యాన్నిచ్చాయి. వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెరిగింది' అన్నారు ఉషారాణి.
విదేశాల్లో సముపార్జించిన విజ్ఞానం స్వదేశానికి తిరిగొచ్చాక ఉపయోగపడ్డాయి. ఐఐసీటీ శాస్త్రవేత్తగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడు రైతుల కష్టాలను కళ్లారా చూసింది. 'ఓసారి పంటలపై పురుగు మందుల్ని స్ప్రే చేస్తున్న రైతు నేను చూస్తుండగానే సొమ్మసిల్లి పడిపోయాడు. ఏం జరిగిందోనని కంగారుపడ్డ నేను అతడి కుటుంబీకుల మాటలు విని మరింత ఆందోళన చెందాను. అలా పడిపోవడం సాధారణమే, కాసేపయ్యాక కోలుకుంటారని చెప్పారు. విపరీతంగా రసాయనాల్ని వాడటం వల్లే ఆ ప్రమాదాలని అర్థం చేసుకున్నా' అంటూ ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. సమస్య పరిష్కారానికికార్యాచరణను వేగిరం చేశారు. రసాయనాల ప్రభావంతో క్యాన్సర్ బారిన పడిన రైతులను చూసి వారి కష్టాలు తీర్చే పరిశోధనలు చేయాలని తపనపడింది.
పెరట్లో పెంచుకునే కూరగాయల మొక్కలపై ఉషారాణి సుదీర్ఘకాలంపరిశోధనలు చేశారు. వాటిల్లోని రసాయనాల నుంచి సహజ పురుగు మందుల తయారీకి శ్రీకారం చుట్టింది. అలా ఆరు రకాల మందులు రూపొందాయి. 'వాటి వాడకంతో పంటల దిగుబడి బావుంటుంది. పర్యావరణానికి ఏ హాని జరగదు. రైతుల ఆరోగ్యం, ఆనందం సాధ్యపడతాయి' అన్నారామె. మూడు దశాబ్దాల నిర్విరామ కృషితో ముందుకు సాగుతున్న ఆమెకు ఇటీవలే జపాన్ కాన్సులేట్ హియోషీ పర్యావరణ జాతీయ అవార్డునిచ్చి సత్కరించింది. నేషనల్ అకాడెమీ ఆఫ్ బయలాజికల్ సైన్స్ (నాబ్స్) ఫెలోషిప్ ప్రకటించి సత్కరించింది. మన రాష్ట్రం నుంచి ఈ పురస్కారం అందుకున్న మహిళా శాస్త్రవేత్త ఉషారాణి ఒక్కరే!
ఉషారాణి కేవలం పరిశోధనలకే పరిమితం కాలేదు. గ్రామాల్లో పర్యటిస్తూమహిళల్ని, రైతుల్ని చైతన్యపరుస్తూ రసాయనిక పురుగుమందుల వాడకంతోకలిగే దుష్పరిణామాల్ని వివరిస్తున్నారు. ఖాళీ అయిన పురుగు మందుల డబ్బాల్ని ఇళ్లలో వాడితే అనారోగ్యాల బారిన పడతారని హెచ్చరిస్తోంది. విదేశాల్లో నిషేధించిన మందుల్ని మనదేశంలో ఇప్పటికీ వాడటంపై సదస్సుల్లో ప్రస్తావిస్తోంది.
సహకారం : ప్రసాద్. cortesy: eenadu
మంచి విషయం తెలియజేసారు నెనర్లు.
ReplyDelete