Pages

Monday, December 21, 2009

'జీవితాన్ని, కెరీర్‌ని, పనిని సీరియస్‌గా తీసుకో'

హలో నేనే అనీషా. నేనిలా కార్లను తళతళలాడించే రంగంలోకి వస్తానని అనుకోలేదెప్పుడూ. అయితే ఒకటి, ఉద్యోగం చేయడం కన్నా ఏదయినా సృజనాత్మక వ్యాపారంలో అడుగుపెట్టాలని మొదటి నుంచి ఆలోచించేదాన్ని. మాది మార్వాడీ కుటుంబ నేపథ్యం.

నేను పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే. నాన్న వ్యాపారవేత్త. అమ్మ గృహిణి. నన్ను, అన్న రాఘవ్‌ని మొదట్నుంచి చదువుకొమ్మని ప్రోత్సహించారు. ముంబయి యూనివర్సిటీ నుంచి నేను ఎంబీఏ, అన్న బీఎంఎస్‌ పూర్తి చేశాం.

చదువయ్యాక ఉద్యోగంలో చేరా. మా అమ్మాయి ఫలానా సంస్థలో పని చేస్తోంది అని మా అమ్మ గొప్పగా చెప్పుకొనే స్థాయిదే అది. అనువైన వేళలు. అలసట లేని జీవితం. అయినా నాకందులో ఆనందం కలగలేదు. అదే విషయం అన్నతో అన్నా. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తన పరిస్థితీ అంతే. ఇద్దరం కలిసి మెదడుకు పని పెట్టాం.

చెబితే నమ్మరు కానీ మొదట పళ్లరసాల స్టాల్‌, బోర్డ్‌ గేమ్‌ రూపకల్పనవంటి వాటి గురించే ఆలోచించాం. మాకే నచ్చలేదు. ఎన్నో చర్చల తరవాత కారు క్లీనింగ్‌ ఆలోచన తట్టింది. ఇల్లు తరవాత చాలామంది అవసరంగా కొనుక్కునే వస్తువు కారు. మోజుపడి, ఖరీదుపెట్టి, మంచి బ్రాండ్‌నే ఎంచుకుంటారు. కానీ నిర్వహణ విషయానికొచ్చేసరికి... చాలామంది వాచ్‌మెన్‌, డ్రైవర్‌, ఇంట్లో పని మనిషికే పరిమితం అవుతారు.లేదంటే తెలిసిన చోట శుభ్రం చేయిస్తారు. వీటికి బదులుగా... పైపై మెరుగులకే పరిమితం కాకుండా... విడి భాగాల మన్నిక, శుభ్రతకూ ప్రాధాన్యమిస్తూ ప్రొఫెషనల్‌ సంస్థనొకదాన్ని ఆరంభించాలని అనుకున్నాం. అదే మిస్టర్‌ కార్‌బాత్‌. ఐదులక్షల పెట్టుబడితో మొదలైంది.అన్న, నేను వ్యాపార భాగస్వాములం.

ఉద్యోగానికి రాజీనామా చేశా. అన్నతో కలిసి కార్‌ క్లీనింగ్‌ సర్వీసులో చేరిపోయాను. ఎంతో తెలివైన వాడనుకొన్న కొడుకు, తరవాత కూతురు ఇలా కార్లు కడిగే పనిలోకి రావడం మా అమ్మానాన్నలకి రుచించలేదు. మా ప్రణాళికలు వివరించి ఒప్పించాం. కానీ నలుగుర్లోకి వెళ్లినప్పుడు ఏం చెప్పాలో తెలిసేది కాదు. మనదేశంలో ఇదొక వ్యవస్థీకృత రంగం కాదు. కనీసం అందరూ మెచ్చుకునే ఉద్యోగం కాదు. అందుకే ఉద్యోగాలూ చేస్తూనే, కార్‌ క్లీనింగ్‌ సేవలందిస్తున్నా అనిఅబద్ధం చెప్పేదాన్ని. లేదంటే 'జీవితాన్ని, కెరీర్‌ని, పనిని సీరియస్‌గా తీసుకో' అంటూ లెక్చరిస్తారని భయం.

ఎవరో ఏదో అంటారని కాదు, అడుగుపెట్టిన రంగంలో విజయం సాధించాలని నాకూ ఉంటుందిగా! స్థానికంగా ఉండే చిన్న క్లీనింగ్‌ సెంటర్లకి వెళ్లా. త్రీఎం వంటి సంస్థల్ని సందర్శించా. విడిభాగాల శుభ్రతకు ఏ పద్ధతుల్ని అనుసరిస్తున్నారు, ఏయే తరహా పనిముట్లు వాడుతున్నారు, ఏయే రసాయనాలు వినియోగిస్తున్నారన్న అధ్యయనం కోసం విదేశాలకు వెళ్లా. ఈ తపన సత్ఫలితాలనిచ్చింది. ఆరంభించిన తొలినాళ్లలోనే వినియోగదారులు మమ్మల్ని ఆదరించారు. నోటిమాటగా ముంబయి అంతా పాకింది. దేశవ్యాప్తంగా పలు ప్రసార మాధ్యమాలు నన్ను, అన్నయ్యను ఇంటర్వ్యూ చేశాయి.

గ్యారేజీలు, సర్వీసు స్టేషన్లలోని సాధారణ పనితీరుకి ఎంతో భిన్నమైన, ఎన్నోరెట్లు మెరుగైన సేవలను మేం అందిస్తాం. అధ్యయనం, పరిశోధనల్లో నిగ్గుతేలిన పద్ధతుల్ని ఆచరిస్తాం. కారు బయటి, లోపలి భాగాలను శుభ్రపరిచేందుకు మేం పాతిక పద్ధతుల్ని అనుసరిస్తాం. రకరకాల బ్రష్‌లు, రసాయనాలు, ఉపకరణాలు, యంత్రాలు వాడతాం. ఒకరకంగా చెప్పాలంటే, కొత్తకారు రూపాన్ని తీసుకొచ్చి అప్పగిస్తాం.

ఈ రంగంలో మహిళలు అరుదు. బహుశా లేరనే చెప్పాలి. కానీ సహనం, సమయపాలన, శ్రద్ధ, చొరవ ఉన్న వారికి ఈ రంగంలో చక్కటి అవకాశాలున్నాయి. కానీ ఇది కూర్చుని చేసే పని కాదు. ఫలానా సమయం అని లేకుండా పరుగులు తీసి సేవలందించాలి. సేవల తీరు, విడిభాగాల నాణ్యత గురించి వివరించే పరిజ్ఞానం సంపాదించాలి. అయితే ఇదొక గుర్తింపు ఉన్న ఉద్యోగం కాదు కాబట్టి చదువుకున్న వారు రారు. వచ్చినా ఎక్కువ జీతాలు ఇవ్వాలి. ఆ సమస్యలన్నిటినీ అధిగమిస్తే ఆదాయం, ఆనందం.

courtesy: eenadu

No comments:

Post a Comment