Pages

Saturday, December 5, 2009

మహిళా సంపాదకులు

ఎడతెగని జాతుల సమరం. భీకరమైన గెరిల్లా పోరు నియంతృత్వపు పదఘట్టనలు. అరాచక శక్తుల అత్యాచారాలు బాంబుల మోతలు... రక్తపుటేరులు. వీటన్నిటి శోధనకు ఆడా, మగా అన్న తేడా లేదు. సాహసం ముఖ్యం. ప్రజాహితం ప్రధానం 'ఆ తెగువ... ఆ నేర్పు మాకున్నాయి... అందుకే కలం పట్టాం... అక్షర యాగం చేస్తున్నాం'అంటున్నారు మహిళా విలేకరులు, సంపాదకులు.

హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన మహిళా సంపాదకులు అభివృద్ది వార్తల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రసారమాధ్యమాల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని.. వారి రాక సామాజిక మార్పునకి దోహదం చేసేదిగా ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రజావసరాలకే ప్రాధాన్యం...
పత్రికలు రాజకీయ వార్తలకు పరిమితం అవుతుంటాయని ఓ వాదన ఉంది. కానీ అటువంటి పరిస్థితి మా దేశంలో లేదన్నారు బల్గేరియాలో టెలిగ్రాఫ్‌ పత్రికకు డిప్యూటీ ఎడిటర్‌గా ఉన్న మాయా మాల్డినోవా. 'మా దేశంలోని ముఖ్యమైన పది పత్రికల్లో ఐదింటికి ప్రధాన సంపాదకులు మహిళలే. రిపోర్టింగ్‌లోనూ అమ్మాయిలదే పైచేయి. చర్చలతో కాలయాపనకంటే వేగానికే విలువిస్తాం. మానవీయ వార్తలకే పెద్ద పీట. బహుశా మీడియాలో మహిళల ప్రవేశం పెరిగాక చోటుచేసుకున్న పెద్ద మార్పు ఇదేననుకుంటా. అలాగే రాజకీయ వార్తల కంటే ప్రజలకు ఉపయోగపడే సమాచారం అందివ్వడానికే అత్యధిక ప్రాధాన్యమిస్తాం. ఒక రైలు పది నిమిషాలు ఆలస్యంగా వస్తుందంటే.. ఆ విషయాన్ని పాఠకులకు తెలపాలని ఆరాటపడతాం' అని వివరించారు.

బ్రేకింగ్‌ న్యూస్‌లో నంబర్‌వన్‌
ముద్రణ, ఎలక్ట్రానిక్‌ రంగాలే కాదండోయ్‌... నెట్‌, మొబైల్‌ మాధ్యమాల్లోనూ మహిళలు ముందంజ వేస్తున్నారు. అందుకు జర్మనీ వంటి దేశాలు ఉదాహరణ. 'మా మీడియాలో సగం వాటా మహిళలదే. మ్యాగజైన్ల నిర్వహణయితే పూర్తిగా వారిదే. నేను బాధ్యతలు నిర్వహిస్తున్న వొడాఫోన్‌ మొబైల్‌ న్యూస్‌ విభాగంలో ఇప్పటికే 22 శాతం యువతులున్నారు. ఎలక్ట్రానిక్‌, మొబైల్‌, నెట్‌ వార్తల్లో... వేగమే ముఖ్యం. ఎంత వేగంగా స్క్రోలింగ్‌ ఇచ్చాం అన్నదే ప్రాధాన్యం. బ్రేకింగ్‌న్యూస్‌ ఒరవడిలో అమ్మాయిలే ముందున్నారని నేను గర్వంగా చెప్పగలను. మా జర్మనీలో ఆడమగా అంటూ అసమానతలు లేవు. మహిళల అభివృద్దికి ఎక్కడా బ్రేకుల్లేవు' అంటూ అభిప్రాయాలు పంచుకున్నారు వొడాఫోన్‌ మొబైల్‌ న్యూస్‌ విభాగానికి ఎడిటర్‌గా ఉన్న యూటే కొరింత్‌.

పిల్లల కోసం జాతీయ పత్రికలు
పారిస్‌ పేరు చెబితే చాలు.. ఫ్యాషన్‌ గుర్తొస్తుంది. ప్రపంచానికి సొగసు పాఠాలు నేర్పే ఆ దేశంలో పత్రికలు వినోదానికి ప్రాధాన్యం ఇస్తున్నాయని అనుకుంటున్నారా! కాదు... విజ్ఞానానికే పట్టం కడుతున్నాయి. ఆ విషయాన్నే ఇలా వివరించారు ఆరలిన్‌ మెక్‌మేన్‌. ఈమె వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూస్‌పేపర్స్‌ అండ్‌ న్యూస్‌ పబ్లిషర్ల తరఫున పనిచేస్తున్నారు. 'పిల్లలు, యువత, మహిళలకు సంబంధించిన వార్తలే మా పతాక శీర్షికలు. మీకు తెలుసా? ఏ దేశంలో లేని విధంగా పారిస్‌లో పిల్లల కోసం మూడు జాతీయ పత్రికలు నడుస్తున్నాయి. 24 శాతం వార్తలు యువతను ఉద్దేశించినవే. మేం రాజకీయ వార్తలు రాస్తాం... కానీ అవి కచ్చితంగా అభివృద్ధిని కోరేవి అయి ఉండాలి. మా దేశంలోని ఆరు ప్రధాన వార్తాపత్రికల్లో ఇద్దరు మహిళా సంపాదకులు ఉన్నారు. పారిస్‌లో మహిళా విలేకరులకు ఓ ప్రత్యేక సదుపాయం ఉంది. అత్యధికంగా రెండేళ్లపాటు ప్రసూతి సెలవు ఇస్తారు' అన్నారు.

ఈ తరం అభిరుచులకు ప్రాధాన్యం...
టీవీ, రేడియో, నెట్‌ ప్రభావం అధికమయ్యాయి. దీంతో పత్రికలు చదివే ఈనాటి అమ్మాయిల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకుండా ఏం చేస్తున్నారో వివరించారు ఉక్రెయిన్‌కి చెందిన ఓక్సానా. 'పత్రికలను చదివే అలవాటును పెంచే దిశలో యూరప్‌లో కొన్నిచోట్ల పత్రికలను ఉచితంగా పంచుతున్నారు. అలాగే వార్తల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు..' అని వివరించారు.

పాక్‌లో వేతన వ్యత్యాసం...
ప్రపంచదేశాల్లోని పరిస్థితులు ఒకరకంగా ఉంటే పాకిస్తాన్‌లో మరోరకం. ఉగ్రవాదం, నియంతృత్వం. స్వేచ్ఛకు లెక్కలేనన్ని పరిమితులు. ఈ పరిస్థితుల్లోనూ మహిళా పాత్రికేయులు మొక్కవోని దీక్షతో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ 'ది న్యూస్‌ ఆన్‌ సండే'కు చీఫ్‌ ఎడిటర్‌గా ఉన్న ఫరాజియా... న్యూస్‌లైన్‌ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా ఉన్న రెహానా హకిమ్‌... దక్షిణాసియా ఫ్రీ మీడియా అసోసియేషన్‌ ప్రిన్సిపల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా ఉన్న మెహమల్‌ సర్‌ఫ్రాజ్‌... తమ అంతరంగం ఆవిష్కరించారు.

''మా దేశంలో ఎన్నో అస్థిరతలు. గిరిజన పోరాటాలు. తీవ్రవాద శక్తులు. ఈ సమయంలో పరిశోధనాత్మక వార్తలకే మా ఓటు. మా జాతీయ, అవీ ఆంగ్ల పత్రికల్లో మహిళలు చురుగ్గా పనిచేస్తున్నారు. సంపాదకత్వం వహిస్తున్నారు. స్థానిక పత్రికల్లో మాత్రం పూర్తి నిరాశజనకమైన పరిస్థితులున్నాయి. ఎడిటింగ్‌ రంగంలో మాత్రం మహిళలదే ఆధిపత్యం. అయితే మేమూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. మొదటి పేజీలో హింసాత్మక, ఉగ్రవాదుల ఫొటోలు ఇవ్వడం తగ్గించాం. ఆరోగ్యం, చదువు, అభివృద్ధి వార్తలకు ప్రాధాన్యం పెంచాం. స్వాత్‌లోయ లాంటి తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో రిపోర్టింగ్‌, డ్రగ్‌ మాఫియాను ఎదురించి వార్తలు రాయడంలో మా మహిళా జర్నలిస్టులు ఎంతో సాహసం ప్రదర్శిస్తున్నారు. పురుషులతో పోటీపడి విధులు నిర్వహిస్తున్నా స్థానిక పత్రికల్లో తీవ్రమైన వేతన వ్యత్యాసాలు ఉన్నాయి.''

courtersy : eenadu

No comments:

Post a Comment