Monday, March 8, 2010
శనిశ్వరుడికి భయపడేవాళ్ళ కోసం ఈ పోస్ట్ !
శనిత్రయోదశి నాడు శనైశ్చరుని భక్తితో కొలిచినవారికి శుభాలనొసగుతాడనీ 'ఏలిననాటి శని దశ' వారిని అంతగా బాధించదనీ పురాణాలు చెబుతున్నాయి. (ఈ నెల పదమూడు శనిత్రయోదశి)
శనయే క్రమతి సః... నెమ్మదిగా చరించేవాడు శని అని పురాణోక్తి. శనిగ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమించేందుకు పట్టే కాలం 30 సంవత్సరాలు. అదే మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగేందుకు పట్టే కాలం 24 గంటలు. అంత నెమ్మదిగా కదిలేవాడు కాబట్టి శనీశ్వరుణ్ని 'మందుడు' అన్నారు మహర్షులు. నవగ్రహాల్లో ఏడోవాడైన శనీశ్వరుడు జీవరాశులను సత్యమార్గంలో నడిపించేందుకే అవతరించాడని ప్రతీతి.
జన్మవృత్తాంతం
పద్మపురాణం, స్కాందపురాణం, సూర్యపురాణం... ఇలా అనేక పురాణాల్లో శనీశ్వరుని జన్మవృత్తాంతం, ఆయన మహిమల గురించి కనిపిస్తుంది. వాటిప్రకారం త్వష్టప్రజాపతి(విశ్వకర్మ) కుమార్తె అయిన సంజ్ఞ సూర్యుని భార్య. వారికి వైవస్వతుడు (ప్రస్తుత మనువు ఈయనే), యముడు, యుమున అనే ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ, ఎంతోకాలం సూర్యుడి తేజస్సుని భరించలేకపోయిన సంజ్ఞ తన నీడకు ప్రాణం పోసి 'ఛాయ' అని పేరుపెట్టి ఆమెను తన స్థానంలో ఉంచి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయిందట. నాటి నుంచి ఛాయాదేవి సూర్యునకు ఏమాత్రం అనుమానం కలగకుండా సంజ్ఞాదేవిలాగానే ప్రవర్తిస్తూ ఉండేదట. సూర్యుడికి ఛాయదేవి వలన సావర్ణుడు, శని, తపతి జన్మించారు. శని తన కడుపున ఉండగా ఛాయాదేవి ఈశ్వరుని గురించి తపస్సు చేసిందనీ... ఆమె కఠోరదీక్ష వల్ల కడుపులో ఉన్న శని నల్లగా అయిపోయాడనీ కానీ అదే దీక్ష వల్ల అనేక ఈశ్వర శక్తులు లభించి శనీశ్వరుడుగా పేరు పొందాడనీ ఒక కథనం.
సూర్యుడి వరం కారణంగా శని మకర, కుంభరాశులకూ నవగ్రహాలకూ అధిపతి అయ్యాడని పురాణోక్తి. శనీశ్వరుడి వాహనం కాకి. నలుపు రంగు, నల్లనువ్వులు, జిల్లేడు ఆకులను ఇష్టపడతాడనీ తైలాభిషేకప్రియుడనీ చెబుతారు. లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి(ఈమెనే దరిద్రదేవత అంటారు) శనైశ్చరుడి భార్య. అంటే శనిభగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అన్నమాట. శనిదూషణ సర్వదేవతలనూ తిట్టినదాంతో సమానం అని పెద్దలు చెబుతారు. ఆయనను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనైశ్చరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం. అందుకే హనుమత్‌దీక్షలో ఉన్నవారినీ అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులనూ ఆయన బాధించడని నమ్మిక.
న్యాయాధికారి
మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గనరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
courtesy : eenadu sunday
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment