Pages

Friday, March 12, 2010

నాకు పెళ్లయ్యేలా చూడుస్వామీ!

చిలుకూరు బాలాజీ గుడికెళ్తే వీసా త్వరగా దొరుకుతుందంటారు. పిల్లలు పుట్టని వాళ్లు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తారు. మరి, ముప్పైలు దాటిపోతున్నా పెళ్లి కాని వారి కోసం అలాంటి ప్రత్యేక ఆలయాలేవైనా ఉన్నాయా అంటే... తమిళనాడులో అలాంటివి పదకొండు గుళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ ఒకేసారి చుట్టబెట్టేలా ఆ రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేకంగా ఓ ప్యాకేజీనే ఏర్పాటు చేసింది.
'తిరుమణ తిరుతల సుట్రుల్లా'

తమిళనాడులో ఇప్పుడు పెళ్లికాని అమ్మాయిలూ అబ్బాయిలు పఠిస్తున్న తారకమంత్రం ఇది.

'కల్యాణ క్షేత్రాల పర్యటన' సదరు మంత్రానికి అచ్చతెలుగు అనువాదమిది. అనగా... వివాహాలకు అడ్డొచ్చే విఘ్నాలను తొలగించి త్వరగా పెళ్లయ్యేలా దీవించే దేవుళ్లున్న క్షేత్రాల పర్యటన అన్నమాట.

ఆలయాల గడ్డగా పేరొందిన అరవదేశంలో అలాంటివి పదకొండు గుడులు ఉన్నాయి. పెళ్లికాని వారంతా ఏవరికి వారు విడివిడిగా ఆయా క్షేత్రాలకు వెళ్లడం కద్దు. వారి అవస్థలు చూసిన టీటీడీసీ(తమిళనాడు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ .్మ్మ్ట్ఞ్న్థ్ద్ౖథ్ఠ.్ఞ్న్ఝ) ఈ ప్యాకేజీకి రూపకల్పన చేసింది.
ఏమేం ఆలయాలంటే...
మూడు రోజుల యాత్రలో భాగంగా తీసుకెళ్లే క్షేత్రాలివీ...
ముదిచూర్‌: తాంబరం (చెన్నై)లోని ముదిచూర్‌ ఆలయ దర్శనంతో యాత్ర వెుదలవుతుంది. హరిహరులిద్దరూ కొలువైన ఈ ఆలయంలో ప్రధాన దైవం విద్యాంబిగై అమ్మవారు. పెళ్లి కాని వారు ఈ గుడిలో ప్రార్థన చేస్తే త్వరగా కల్యాణయోగం సిద్ధిస్తుందని నమ్మిక.
తిరువిడనత్త్తె: మహాబలిపురం వద్ద వెలసిన లక్ష్మీవరాహస్వామి ఆలయం... తిరువిడనత్త్తె. ఇక్కడ అమ్మవారు కోమలవల్లీ తాయారు. త్రేతాయుగంలో కలవుడు అనే మహర్షికి పుట్టిన 360 మంది కూతుళ్లనూ విష్ణుమూర్తి వివాహమాడినట్టు స్థలపురాణం. వరాహరూపంలో సతీసమేతంగా కొలుటవైన ఈ స్వామిని నిత్యకల్యాణ పెరుమాళ్‌గా వ్యవహరిస్తారు భక్తులు.
తిరుమణంజేరి: శివుడు కల్యాణసుందరేశ్వరర్‌గా పూజలందుకుంటున్న పవిత్ర క్షేత్రం తిరుమణంజేరి. శివపార్వతుల కల్యాణం జరిగింది ఇక్కడేనని ప్రతీతి.
ఉప్పిలియప్పన్‌: అంటే ఉపమానాలకు అందనివాడు, అనుపమానుడు అని అర్థం. ఇది వైష్ణవక్షేత్రం. స్థానికుడైన మార్కండేయన్‌ అనే వ్యక్తికి పుట్టిన భూదేవి 'కోకిలాంబాళ్‌' పేరుతో పెరిగి శ్రీమహావిష్ణువును పెళ్లిచేసుకుందని ప్రతీతి. అందుకే ఈ ఆలయమూ కల్యాణాలకు ప్రసిద్ధి.
నాచ్చియార్‌ ఆలయం: విష్ణుమూర్తి నరైయూరు నంబిగా అమ్మవారు నాచ్చియార్‌గా కొలువైన దేవళం ఇది. విష్ణుమూర్తి 108 దివ్య దేశాల్లో ఒకటి.
తిరుకరుకావూర్‌: ఇక్కడి అమ్మవారు గర్భరక్షాంబిగై.పెళ్లికాని, పెళ్లయినా పిల్లలు పుట్టని మహిళలు ఈ తల్లిని దర్శించుకుంటారు. ఇక్కడి శివలింగం పుట్టమన్నుతో తయారైంది. అందుకే అభిషేకం చేయరు. పునుగు సుగంధ ద్రవ్యాన్ని మాత్రం అద్దుతారు.
తిరుచ్చేరై: ఇది కూడా 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటి. విష్ణువు శ్రీదేవీభూదేవీ సమేతంగా 'సారనాథుడు'గా కొలువుదీరిన క్షేత్రం. ఇక్కడ అమ్మవారు సారనాయకి. కావేరీ నది ఆ హరిని పెళ్లాడింది ఇక్కడేనని స్థలపురాణం.
మదురై: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం. పాండ్యరాజు తన కుమార్తె మీనాక్షిని చొక్కనాథుడైన శివుడికి ఇచ్చి పెళ్లి చేసిన చోటు. పెళ్లికాని అమ్మాయిలు మదుర మీనాక్షిని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.
తిరునల్లూరు: శివుడు పంచవర్ణేశ్వరుడిగా కొలువైన క్షేత్రమిది. ఈ స్వామిని కల్యాణ సుందరేశ్వరుడిగా కొలుస్తారు భక్తులు. శివపార్వతుల కల్యాణాన్ని అగస్త్యుడు ఇక్కణ్నుంచే చూశాడని పురాణప్రవచనం.
తిరువేడగం: వైగై నదీ తీరాన కొలువుదీరిన శైవక్షేత్రమిది. ఇక్కడ స్వామిని ఏడగనాథర్‌ పేరుతో కొలుస్తారు. అమ్మవారు ఇలావర్‌ కులాలి అమ్మై.
తిరువీళిమిళలై: శివుడు కాత్యాయనీ దేవిని వివాహం చేసుకున్నట్టు చెప్పే పవిత్ర క్షేత్రమిది. ఇక్కడ ఈశ్వరుడు వీళినాథుడు.
ఎంత, ఎలా...
ఈ కల్యాణ క్షేత్రాల యాత్రకు రుసుము రూ.1800. మధ్యలో బసచేసే చోట హోటల్‌ గదిని ఇంకొకరితో కలిసి పంచుకుంటానంటే రూ.1400 సరిపోతాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దర్శనం రుసుము అన్నీ అందులోనే. ప్రతి శుక్రవారం ఉదయం ఆరుగంటలకు చెన్నైలో టూరు వెుదలవుతుంది. మళ్లీ సోమవారం నాటికి అన్ని క్షేత్రాలూ దర్శించుకుని ఎక్కినచోటే దిగొచ్చు.

కొసమెరుపు: పర్యాటక శాఖవారు ఏ ఉద్దేశంతో ఈ టూరును ఏర్పాటు చేసినా పెళ్లికాని వారి ఆలోచనలు మాత్రం ఇంకో రకంగా ఉన్నాయి. 'అదృష్టం బాగుంటే... మనతోపాటే బస్సులో ఎక్కిన అమ్మాయో/అబ్బాయో ఈ మూడురోజుల్లో కాస్త దగ్గరై, ఆనక భాగస్వామి అయినా అయిపోవచ్చు కదా' అని ఆశపడుతున్నారు.

- courtesy : eenadu sunday

7 comments:

  1. టపా బాగుంది. మంచి ఉపయోగకరమైన విషయం.

    >>'అదృష్టం బాగుంటే... మనతోపాటే బస్సులో ఎక్కిన అమ్మాయో/అబ్బాయో ఈ మూడురోజుల్లో కాస్త దగ్గరై, ఆనక భాగస్వామి అయినా అయిపోవచ్చు కదా'

    అసలా టూరు ఉద్దేశ్యమే అది కదా ఇంకేమి. వచ్చేటప్పుడు జంటగా వస్తారు. కాదంటారా.

    ReplyDelete
  2. కళ్యాణమైనా...కక్కైనా ఆగదులెండి:):)

    ReplyDelete
  3. > 'అదృష్టం బాగుంటే... మనతోపాటే బస్సులో ఎక్కిన అమ్మాయో/అబ్బాయో ఈ మూడురోజుల్లో కాస్త దగ్గరై, ఆనక భాగస్వామి అయినా అయిపోవచ్చు కదా
    :-))

    ReplyDelete
  4. :) :) :)


    "ఒంటరిగా రండి-జంటగా వెళ్లండి***" అని క్యాప్షన్ పెడితే ఇంకా బాగా ఆకర్షితులవుతారనుకుంటా ఆ ప్యాకెజీకి. :))).

    *** = షరతులు వర్తిస్తాయి (conditions apply).

    ReplyDelete
  5. ఏంటి ప్రకాష్ నేను రాసిన ఆర్టికల్ ఇక్కడ పెట్టేశావ్... అదీ నా అనుమతి లేకుండా... హమ్మా ఎంత ధైర్యం...
    -కేబీఎల్

    ReplyDelete