ఒక భక్తుడు భగవంతుణ్ని ప్రశ్నించాడట- 'స్వామీ! మా మిత్రుడికి అపారమైన ఐశ్వర్యాన్నిస్తున్నావు. విలాసాల్లో తేలిపోతున్నాడు. మరి నామీద దయలేదేమి?' అని. అందుకు భగవంతుడు- 'నాయనా! నీ మిత్రుడు ఐశ్వర్యమే కోరుకున్నాడు. ఇచ్చాను. సుఖశాంతుల ప్రస్తావన లేదు. అందుకే అవి ఇవ్వలేదు. నీపై కరుణ ఉన్నది. కనుక నేన్నీకు సంపదనివ్వక సంతృప్తినీ, సుఖశాంతుల్నీ ఇస్తున్నాను అని బదులిచ్చినట్లు కథ.
లోభి అయిన సంపన్నుడు సాగరం లాంటివాడు. దాహం తీర్చలేడు, సమాజానికి పనికిరాడు. దరిద్రుడైనా దానగుణమున్నవాడు చెలమ వంటివాడు. ఆప్తుల్ని ఆదుకొనే మానవోత్తముడు. శ్రమవెంట మనం పడాలి. సుఖం మన వెంట పడుతుంది. ధనహీనుడు దరిద్రుడు కాడు. భక్తిహీనుడే దరిద్రుడు. జ్ఞానహీనుడే దరిద్రుడు. సంస్కారహీనుడే దరిద్రుడు. అధార్మికుడే దరిద్రుడు. ఈ సత్యం గ్రహించగలిగితే- ధర్మబద్ధమైన ధనార్జనకే సంసిద్ధులమవగలం.
chaalaa mamchi vishayam cheppaaru
ReplyDelete